Sep 07,2023 23:36
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోన రఘుపతి

ప్రజాశక్తి-బాపట్ల: భావితరాలకు బంగారు బాపట్లను అందించాలనే లక్ష్యసాధనలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. గురువారం బాపట్ల ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీ హైవే పక్కన ఎమ్మెల్యే కోన రఘుపతి సమకూర్చిన ఐదు సెంట్ల స్థలంలో జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భవన నిర్మాణానికి ఆయన సొంత నిధులు రూ.ఐదు లక్షల నగదును జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు అందజేశారు. బాపట్ల జిల్లాగా ఆవిర్భవించిన ఈ దశలో జర్నలిస్టు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణం రానున్న జర్నలిస్టులకు ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. ఎంతో పవిత్రమైన పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న విలేకరులు నిస్పాక్షికంగా వార్తలు రాసే జర్నలిజం నేటి తరానికి అవసరమన్నారు. ప్రతి విలేఖరి రాసే వార్తలు ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ఎవరు తప్పు చేసినా నిష్పక్షికంగా నిజాలను నిర్భయంగా వార్తల రూపంలో పత్రికల్లో ప్రతిబింబించే విధంగా జర్నలిస్టులు ఉండాలన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు జర్నలిస్టులు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా పత్రికల ద్వారా తేటతెల్లం చేయాలన్నారు. శాసనమండలి సభ్యులు పోతుల సునీత మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పాత్రికేయుల పాత్ర ఎంతో విశిష్టమైనదన్నారు. బాపట్ల జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ భవన నిర్మాణానికి తమ వంతుగా రూ.లక్ష అందజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
సర్వమత ప్రార్థనలతో జరిగిన బాపట్ల జర్నలిస్టు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా అంజిబాబు, అంటరానితనం నిర్మూలన రాష్ట్ర అధ్యక్షుడు జి చార్వాక, బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, కర్లపాలెం జడ్పిటిసి సభ్యులు పిట్ల వేణుగోపాలరెడ్డి, ఎంపీపీ యారం వనజ, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, బాపట్ల టిడిపి ఇన్‌ఛార్జిత వేగేశన నరేంద్రవర్మ, పూర్వ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్‌ ప్రభాకర్‌, సర్పంచి మాడ సుబ్రహ్మణ్యం, కోకి రాఘవరెడ్డి, పీటా బాబు, ఎజరయ్య, వర్తకమిత్ర డాక్టర్‌ కొత్తమాసు సత్యనారాయణ పాల్గొన్నారు.