Jan 09,2023 23:39

జర్నలిస్టులతో క్రికెట్‌ ఆడుతున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-సీతమ్మధార : రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌ ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లో భాగంగా సోమవారం పోర్టు మైదానంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇరు జట్ల క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకున్నారు. కాసేపు బ్యాటింగ్‌ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసిపి మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఉందని, వీలైనంత త్వరలో ఆ ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు. విశాఖలో పెండింగ్‌లో ఉన్న 2005 జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇటీవల తాను అధికారులతో మాట్లాడి, వారి సూచన మేరకు న్యాయసలహా కోసం సంబంధిత ఫైలును పంపించినట్లు తెలిపారు. వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరమ్‌ సేవలను మంత్రి కొనియాడారు. క్రీడల్లో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. విజెఎఫ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జర్నలిస్టుల క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్య, వైద్యానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి అమర్‌నాథ్‌ను విజెఎఫ్‌ కార్యవర్గం సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఆర్‌ నాగరాజుపట్నాయక్‌, ఉమా శంకర్‌బాబు, జి.నరసింహారావు, పి.భాస్కర్‌, ఎమ్మెస్సార్‌ ప్రసాద్‌, గిరిబాబు, వరలక్ష్మి, దివాకర్‌, ఈశ్వరరావు, మాధవరావు, శేఖర్‌ మంత్రి తదితరులు పాల్గొన్నారు.
సోమవారం నాటి సెమీ ఫైనల్స్‌లో ఆంధ్రప్రభ జట్టుపై ఆంధ్రజ్యోతి జట్టు విజయం సాధించింది. మంగళవారం ఫైనల్స్‌లో వీడియో జర్నలిస్టులు, ఆంధ్రజ్యోతి జట్టు తలపడనున్నాయి.