ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జర్నలిస్ట్‌ల ఐక్యతే సమాజానికి మేలు చేస్తుందని, తద్వారా మంచి సమాజాన్ని, దేశాన్ని నిర్మించుకోగలమని జనసేన నాయకుడు గురాన అయ్యలు అన్నారు. దీపావళిని పురస్కరించుకొని శనివారం విజయనగరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని వర్కింగ్ జర్నలిస్ట్‌లకు దివాళి గిఫ్టులను అయ్యలు వితరణగా అందించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ జర్నలిస్ట్ లంతా ఒక తాటిపై ఐక్యంగా కనిపించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అంతా ఐక్యంగా ఉంటేనే సమాజంలోని రుగ్మతలను పారద్రోలగలరని, పాలనలో అవినీతిని రూపుమాపగలరని అన్నారు. తమ తండ్రి గురాన సాధురావు నాటి కాలం నుంచి అయన వారసత్వంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామని, జర్నలిస్ట్ లకు తమ కుటుంబంతో అవినాభవ సంబంధం ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. జర్నలిస్ట్ మిత్రులకు ఏ అవసరం వచ్చినా తన వంతుగా ముందుంటానని అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అయ్యలను సత్కరించారు. నగరంలోని శ్రీరామ ఫైర్ వర్క్స్ యజమాని రవ్వా శ్రీనివాస్ రావు కూడా ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్‌లకు బాణాసంచా సామగ్రి అందజేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన గురాన అయ్యలు, విశిష్ట అతిధిగా విచ్చేసిన డిపిఆర్‌ఒ డి.రమేష్ చేతుల మీదుగా ఈ గిఫ్ట్‌లను జర్నలిస్ట్‌లకు అందించారు. కార్యక్రమంలో నగరంలోని జర్నలిస్టులంతా పాల్గొన్నారు.