మాట్లాడుతున్న అధికారి
జరిమానా కాదు.. చట్టప్రకారం చర్యలు
ప్రజాశక్తి-నెల్లూరు :బాల కార్మికులను పనిలో పెట్టుకుంటున్న యాజమాన్యాలపై జరిమానాలతో సరిపెట్టకుండా తప్పనిసరిగా కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం దర్గామిట్టలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఈనెలలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలపై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించారని, ఈ నెలలో 23 కేసులను నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇదే స్పూర్తితో రానున్న రోజుల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై మరింత శ్రద్ధ పెట్టి మన రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కషి చేయాలని కోరారు. ప్రధానంగా బాలల చేత పనిచేయించుకుంటున్న వివిధ సంస్థలు, దుకాణాలు, హౌటళ్లు, పరిశ్రమలను తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించి, ఆయా కంపెనీల యాజమాన్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలలకు వెళ్ళని డ్రాపౌట్స్ పిల్లలను సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో గుర్తించి, డ్రాపౌట్స్ పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బడికి రాని పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారా అనే విషయాలను ఆరా తీసి వారందరూ సక్రమమైన మార్గంలో నడుచుకునేలా ప్రత్యేక దష్టి పెట్టి పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో కనిపించే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు పంపేలా చొరవ చూపాలన్నారు. అక్రమ బాలల రవాణా, మాదకద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖ అధికారులు ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో వాల్ పోస్టర్లు, హౌర్డింగులను ఏర్పాటుచేసి ప్రజలందరికీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత కార్మిక శాఖ, సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలను కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి వివరించారు.ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ మాధవి, ఐసిడిఎస్ పిడి సౌజన్య, బాలల సంరక్షణ అధికారి సురేష్, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.










