ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని సంపాదనే ధ్యేయంగా కొందరు తాగునీటి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టి కనీస ప్రమాణాలను కూడా పాటించడం లేదు. దాహం వేసి వాటర్ బాటిల్ లేదా ప్యాకెట్ కొనుగోలు చేసి తాగిన తర్వాత అది స్వచ్ఛ నీరా కాదా అన్నది తేల్చుకోలేకపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇళ్ల వద్ద రోజుకి రూ.20 నుంచి 30 వెచ్చించి కొనుగోలు చేస్తున్న నీటిదీ అదే పరిస్థితి. నిబంధనలు పాటిస్తున్నారా.. గుర్తింపు ఉన్న ప్లాంట్ అవునా కదా అనేది స్పష్టత లేకుండా పోతోంది. విచ్చలవిడిగా వీధి వీధినా వెలసిన నీటి వ్యాపార ప్లాంట్లపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.
60 శాతం ప్రజలు ఆర్‌ఒ ప్లాంట్లపైనే
జిల్లాలో రక్షిత తాగునీటి పథకం కుళాయిల ద్వారా పలు ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు రాకపోవడంతో 60 శాతం మందికి పైనే ఆర్‌ఒ ప్లాంట్ల నీటిపైనే ఆధారపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్లాంట్ల వద్దకు వెళ్లి రూ.10 నుంచి రూ.30 వరకూ వెచ్చించి తాగునీరు కొని తెచ్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్, కార్పొరేషన్ కుళాయిల ద్వారా కాక 70 శాతం మంది బయట తాగునీటి పైనే ఆధార పడుతున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో అనుమతులు లేని ఆర్‌ఒ ప్లాంట్లు నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగిస్తున్నాయి. కాకినాడ సిటీలో రమణయ్యపేట, అశోక్ నగర్, జగన్నాథపురం వంటి ప్రాంతాల్లో బిఎస్‌ఐ గుర్తింపు లేకుండానే కొన్ని ప్లాంట్లు వ్యాపారం చేస్తున్నాయి. తుని, కోటనందూరు, రౌతులపూడి, తొండంగి గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ రూరల్, కరప, కాజులూరు మండలాల్లో సైతం పదుల సంఖ్యలో నిబంధనలకు విరుద్ధంగా నీటి వ్యాపారం జరుగుతోంది. కాకినాడ జిల్లాలో మాత్రం 27 వరకు అనధికార వాటర్ ప్లాంట్లను గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ కనీస ప్రమాణాలకు పాతర వేసి పెద్ద ఎత్తున నీటి వ్యాపారం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు.
ఇవీ నిబంధనలు
నిబంధనల ప్రకారం భారతీయ ప్రమాణాల బ్యూరో (బిఐఎస్) గుర్తింపు ఉన్న సంస్థలే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను నడపాలి. కెమికల్, మైక్రో బయోలాజికల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి. ప్రతి రోజూ నీటి నాణ్యతను పరీక్షించి, నెలకు ఒకసారి గుర్తింపు ఉన్న ల్యాబ్‌లలో పరీక్షలు చేయించాలి. ఆయా నివేదికలను బిఐఎస్‌కు పంపి, ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించు కోవాలి. కానీ జిల్లాలో అనేక ప్రాంతాల్లో లూజు తాగునీటి వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. కొన్ని సేవ పేర్లతో, మరికొన్ని వ్యాపారం పేరుతో నామ మాత్రపు సొమ్ములు వసూలు చేస్తున్నామంటూ వ్యాపారం సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో పలువురు గృహ అవసర కుళాయి కలెక్షన్ తీసుకుని 20 లీటర్ల గల టిన్నులలో నీళ్లను నింపి వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి పరీక్షలు చేయకుండానే బోర్ల ద్వారా వచ్చే నీటిని నింపి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీంతో అనేకమంది అనారోగ్యాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎండలు మండుతున్న వేళ సురక్షితమైన తాగునీటిని సేవించకపోతే అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.










