
ప్రజాశక్తి-హిందూపురం : ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం. ఇక మద్యం, కల్లు వ్యాపారాలు అంటే నిబంధనలు మరింత కఠిన తరంగా ఉంటాయి. నకిలీ మద్యం, కల్తీకల్లు ప్రాణంతకం కావడంతో వాటి విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసమే ఏర్పాటైన ఎక్సైజ్ శాఖలో నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి. అనుమతులు లేకుండా ఒక్క సీసా మద్యం కానీ, కల్లు గాని విక్రయిస్తే కేసులు నమోదు అవుతాయి. విక్రయించిన వారు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే విచిత్రం ఏమో కాని శ్రీ సత్యసాయి జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.కల్తీ కల్లు తాగిన వారు డైజోఫామ్ మత్తులో అసుపత్రి పాలవుతున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల పెనుకొండ నియోజక వర్గంలో జరిగిన సంఘటనలే. శ్రీ సత్య సాయి జిల్లాలోనే హిందూపురం, మడకశిర నియోజకవర్గాలు టాడి హబ్‌గా పేరొందాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 దాకా అధికారికంగా కల్లు దుకాణాలు ఉంటే అధికార పార్టీ నేతల కనుసన్నల్లో, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిదుల కనుసన్నల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే నడిచే కల్లు దుకాణాలు వందల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారాల్లో అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులతో పాటు హిందూపురంలో ఓ ప్రజాప్రతినిధి సైతం ఉన్నారు. దీంతో ఎక్స్‌జ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించడానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది. పరిగి మండలం గొల్లపల్లి వద్ద ఉన్న డిపో కల్తీకల్లు సిద్దం చేసి హిందూపురం, పరిగి, లేపాక్షి మండలాల్లో దాదాపు 100 నుంచి 120 కౌంటర్లను ఏర్పాటు చేసి కల్లు వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దుకాణాలపై దాడులు చేయడానికి అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పరిగి మండలం బీచగానపల్లిలో ఓ వ్యక్తి 11 మందితో సోసైటిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇతను అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే అందులో ముగ్గురిని తొలగించి, కుటుంబ సభ్వుల పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నా ఎక్సైజ్ శాఖలో చలనం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికి ఎమైనా తమకు అందే మాముళ్లు సకాలంలో అందుతుంటే చాలు అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ కల్లు తాగి పెనుకొండ నియోజకవర్గంలో ఎంతో మంది అసుపత్రి పాలయ్యారు.
చెట్లు తక్కువ కల్లు ఎక్కువ...
హిందూపురం, మడకశిర నియోజకవర్గాలను ఎక్సైజ్ శాఖ టాడి హబ్‌గా గుర్తించింది. అయితే ఈ ప్రాంతాల్లో చెట్లు తక్కువ ఉన్నా కల్లు వ్యాపారం మాత్రం 'మూడు చెట్లు 300 సీసాలు' అన్న చందంగా కొనసాగుతోంది. హిందూపురం ప్రాంతంలో ఈత చెట్ల వనాలు నామమాత్రం. ఎప్పుడో తాతలు, ముత్తాతల కాలంలో ఉన్న ఈత వనాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అక్కడక్కడ మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులకు మాత్రం ఎటుచూసినా ఈత వనాలే కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే పాత రికార్డులు తెరిచి ఆ గ్రామంలో, ఈ గ్రామంలో ఈత వనాలు వున్నాయంటూ 50 సంవత్సరాల నాటి లెక్కలను నేటికి చూపిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఈత చెట్లు లేకపోయినా ఈ ప్రాంతంలో భారీగా కల్లు ఉత్పత్తి జరుగుతోంది. ఈ కల్లు అంతా చెట్లనుంచి వచ్చిన కల్లు అనుకుంటే పొరబడినట్లే. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కొందరు బడాకల్లు వ్యాపారులు చేరి నకిలీ కల్లు వ్యాపార కేంద్రాలు పెట్టుకున్నారు. ప్రమాదకరమైన క్లోరైల్, హైడ్రేడ్, డైజోఫామ్ తదితర రసాయనాలను ఉపయోగించి కల్లులాంటి తెల్లటి విషాన్ని తయారు చేసి మందుబాబులపై ప్రయోగిస్తున్నారు. దీనికి అలవాటుపడిన వారు తాగకుండా ఉండలేని పరిస్థితి. ఈ విషపు కల్లుతాగి క్రమ క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న అభాగ్యులు ఎందరో ఈ ప్రాంతంలో కనిపిస్తున్నారు. గతంలో లేపాక్షి మండలం తిమ్మగానిపల్లి గ్రామంలో కల్తీకల్లు దొరక్కపోవడంతో దాదాపు 10 మందికిపైగా పిచ్చివాళ్లుగా మారిపోయి ఇందులో ఒక వ్యక్తి కాల్చుకొని చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. మరికొంతమంది వింత వ్యాధితో బాధపడుతున్న సంఘటనలు సైతం వున్నాయి. ప్రతినెల కల్లు సాంపుల్స్ ప్రయోగశాలకు పంపిస్తున్నా అంతా సక్రమంగానే ఉన్నాయంటూ నివేదికలు వస్తున్నాయంటే కల్తీకల్లు మాఫియా ఏ స్థాయిలో మేనేజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైన సెబ్, ఏక్సైజ్ శాఖలు సంయుక్తంగా దాడులు చేసి అనుమతులు లేని కల్లు దుకాణాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సుంది.
సరిహద్దులో అధిక విక్రయాలు
జిల్లా అత్యధికంగా కర్నాటక సరిహద్దును పంచుకుంటోంది. ఎక్సైజ్ శాఖ పరిధిలో టిసిఎస్‌లు 59, గ్రూపు షాపులు 89, టి ఎఫ్ టి లు 177, దుకాణాలు 347 ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరం రెన్యువల్ సందర్భంగా పుట్టపర్తి లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద కల్లు దుకాణాల కోసం పోటీపడే వారితో జాతరను తలపించింది. ఏ కుగ్రామానికి వెళ్ళినా రెండు, మూడు దుకాణాలు కనిపిస్తున్నాయి. హిందూపురం, మడకశిర, ఆగలి, అమరాపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, పరిగి, రొద్దం, గోరంట్ల, అమడుగురు, తనకల్లు వరకు కర్నాటక సరిహద్దు ప్రాంతం ఉంది. కర్నాటకలో కల్లు దుకాణాలు లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఈ దుకాణాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈత చెట్టు నుంచి ఐదు లీటర్ల కల్లు వస్తే దీనికి కల్తీ చేసి 50 లీటర్లు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాంతక ముత్తు పదార్థాలతో కల్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కల్లు తయారీదారులు ప్రాంతాల వారీగా విభజించుకుని ఈత చెట్ల నుంచి కొంత కల్లును సేకరించి మత్తు పదార్థాలను కలిపి తయారుచేస్తున్నారనిది అక్షర సత్యం. జిల్లా సరిహద్దుల్లో ఉన్న కల్లు దుకాణాల్లో సగటున ఒక్కో దుకాణం నుంచి రూ.20వేల నుంచి 60 వేల రూపాయల దాకా విక్రయాలు సాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరిహద్దు దుకాణాల వద్ద జనాన్ని బట్టి కల్తీకల్లు క్షణాల్లో తయారు చేస్తున్నారు. కల్లు తాగినవారు చనిపోయినా, అస్వస్థతకు గురైనా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్సైజ్ శాఖ అధికారులు కల్లు శాంపిల్ సేకరించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సోమందేపల్లి మండలం ఈదుల బలాపురం వద్ద వలస కార్మికులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మహారాష్ట్రకు చెందిన ఓ కార్మికుడు మృతిచెందాడు. దీనిని అధికార పార్టీకి చెందిన ఓ నేత పంచాయతీ చేసి పాము కాటుతో చనిపోయినట్లు చిత్రీకరించి ప్రచారం చేశారని ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. నాలుగేళ్ల క్రితం లేపాక్షి మండలం తిమ్మగానపల్లి, సిరివరం, మానింపల్లిలో కొంతమంది కల్తీకల్లు తాగి మతిస్థిమితం లేకుండా ప్రవర్తించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇటీవల పెనుగొండ మండలం నాగలూరు, బండపల్లిలో 30 మంది కల్తీకల్లు తాగి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఎక్సైజ్ శాఖ అధికారులు శాంపిల్లు సేకరించి చేతులు దులుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు తాగిన వారిలో చాలామంది మానసిక అనారోగ్యం బారిన పడుతున్నారు. అయినప్పటికీ అటు పాలకులు గాని ఇటు ఎక్సైజ్ అధికారులు గాని తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా సరిహద్దులో దుకాణాలు ఉదయం నుంచి రాత్రి వరకు కనిపిస్తున్నాయి. కల్లు విక్రయాలు ఆదాయ వనరులుగా మారడంతో వాటికోసం ఇటీవల ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల జోక్యం పెరిగింది. కల్తీ కల్లు నిరుపేదల ప్రాణాలను హరిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీకల్లు విక్రయాలకు అడ్డుకట్ట వేయాలన్న డిమాండ్ జిల్లాలో ఎక్కువగా వినిపిస్తోంది.