అధికారుల దాడులు నామమాత్రమే
పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజల వేడుకోలు
ప్రజాశక్తి - ముసునూరు
మండలంలోని బలివే, వలసపల్లి, ఎల్లాపురం, తమ్మిలేరు సరిహద్దు గ్రామాల నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు, పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిడితో ఉన్నతాధికారులు వాల్టాచట్టం ఉపయోగంచడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. బలివే, ఎల్లాపురం, వలసపల్లి, గుళ్లపూడి గ్రామాల నుంచే కాకుండా సరిహద్దు గ్రామాలైన ధర్మాజీగూడెం, విజయరాయి, రామచంద్రపురం, రాయుడుపాలెం పలు గ్రామాల్లోని కొందరు ట్రాక్టర్లలో, టాటా ఎస్ వాహనాల్లో, ఎద్దుల బండుల్లో తమ్మిలేరులోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇళ్ల వద్ద, తోటల్లో పెద్ద పెద్ద గుట్టలుగా ఇసుకను ఉంచుతున్నారు. ఆ ఇసుకను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో ఇసుకకు సుమారు రూ.లక్ష ఖర్చవుతుందని పేదలు వాపోతున్నారు. అధికారులు వచ్చి వెళ్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీస్‌స్టేషన్‌లో రోజుకోక కేసు నమోదవుతుందని, వాహనాలను సీజ్ చేస్తున్నారని, రాజకీయ నాయకుల ఒత్తిడిలతో యధావిధిగా మళ్లీ ఇసుక అక్రమ రవాణా సాగుతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.










