నేడు బహిరంగ సభ
ప్రజాశక్తి - గన్నవరం : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సోమవారం కష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాగింది. లోకేష్ యువగళం పాదయాత్ర జాతీయ రహదారిపై 12 కిలోమీటర్ల పొడవునా జన జాతరలాగా సాగింది. యువకులు జోరుగా.. హుషారుగా సందడి చేశారు. నిడమానూరు వద్ద నుండి కొనసాగిన యువగళం పాదయాత్రలో లోకేష్‌తోపాటు కొత్తగా టిడిపిలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నారు. యాత్ర మోడల్ డైరీ వద్దకు రాగానే అందులో పనిచేస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి లోకేష్‌కు కరచాలనం చేశారు. సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత గూడవల్లి సెంటర్‌కు రాగానే టిడిపి శ్రేణులు పెద్దఎత్తున స్వాగతం పలికి హడావిడి చేశారు. పూలమాలలు వేయడంతోపాటు పెద్దఎత్తున పూల వర్షం కురిపించారు. పెద్దలు, యువకులు ఆయనకు కరచాలనం చేశారు. కేసరపల్లి వద్దకు లోకేష్ రాగానే బాణాసంచా మోతలు, నినాదాలతో హోరెత్తించారు. భారీ గజమాలలు, పూలవర్షంతో ముంచెత్తారు అభిమానులు. తీన్మార్ డప్పుల కోలాహలం, యువగళం జెండాలతో యాత్ర ముందుకు సాగింది. గన్నవరం కొత్తపేట సెంటర్లో టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి. లోకేష్ జిందాబాద్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను ఆయన దష్టికి తీసుకువెళ్లారు. టిడిపి హయాంలో తమకు అన్ని రకాలుగా న్యాయం జరిగిందని, వైసిపి వచ్చిన తర్వాత తీరని అన్యాయం జరిగిందని భవన నిర్మాణ కార్మికులు విన్నవించారు. విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని బాధిత రైతులు వినతిపత్రం అందించారు. గాంధీబొమ్మ సెంటర్‌లో న్యాయవాదులతో లోకేష్ సమావేశమయ్యారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, ఎంఎల్‌సి అనురాధ, మాజీ ఎంఎల్‌ఎ బోడె ప్రసాద్, టిడిపి గన్నవరం మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ యాత్ర నేపథ్యంలో గన్నవరం ఎంఎల్‌ఎ వంశీమోహన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని సిఐ కనకారావు తెలిపారు.
కుల వృత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు
రజక, గీత వత్తిదారులకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వాలని వత్తిదారులు లోకేష్‌ను కోరారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 190వ రోజు సోమవారం గన్నవరం నియోజకవర్గంలో సాగింది. తొలుత నిడమానూరు శివారు క్యాంప్ సైట్‌లో బిసి కులవత్తిదారులతో ముఖాముక్షి నిర్వహించారు. ఈ సందర్భంగా రజక, గీత వత్తి దారులు ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఇక్కడ వివిధ చేతి వత్తుల ప్రదర్శన నిర్వహించారు. కుల వత్తులను ఆయన ఆసక్తిగా తిలకించారు.
నేడు గన్నవరంలో బహిరంగ సభ
యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలో లోకేష్‌తోపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.










