ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్
చెరువులు, గుట్టల్లో గ్రావెల్ త్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తూ అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రావెల్ యథేచ్ఛగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా గ్రావెల్ తరలించే వారికి అధికారుల అండదండలు తోవడంతో పట్టపగలే అక్ర మంగా తరలిస్తున్నారు. నియోజవర్గంలో ఒకవైపు ఇసుకను మరోవైపు గ్రావెల్‌ను తోలుకున్నోడికి తోలుకున్నంత రీతిలో దందా నడుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకను ప్రధాన అస్త్రంగా చేసుకొని పెన్నా నదిని మరోవైపు చిత్రావతి నదిలోని ఇసుకను ట్రాక్టర్లు టిప్పర్లులతో ఇష్టానుసారం కాంట్రాక్టర్లు తోలుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను భవిష్యత్ తరాలకు ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపా రస్తులు ప్రధాన రహదారులకు పక్కన ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఎలాంటి అడ్డు, అదుపు లేకుండా చెరువులలోను, కొండ గుట్టలలోను ఉన్న మట్టి, గ్రావెల్‌ను ట్రాక్టర్లతో తోలుకొని తక్కువ ఎత్తులో ఉన్న భూములను ఎత్తులే పుతున్నారు. ప్రభుత్వ స్థలాలను గుంతలుగా మార్చేస్తున్నారనడం నగసత్యం. ఇలా రియల్ ఎస్టేట్ వారు, మరో వైపు అధికార పార్టీ నాయకులు సహజ వనరు లను ఊడ్చేస్తూ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో ముంచేస్తున్నారు. వారు మాత్రం గ్రావెల్‌తో భూములను ప్లాట్స్‌గా మార్చి సొమ్ము చేసుకుంటూ అధికారులకు ముక్యంగా రెవెన్యూ అధికారులకు ముడుపులు, క్వాలిటి కంట్రోల్ అధికారులకు ఒక ట్రాక్టర్‌కు ఒక్కో రేటు కమీషన్‌ల వ్యవహారం నడుస్తుందని ప్రజలు, కొంతమంది ట్రాక్టర్ యజమానులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.650 చొప్పున అందులోనే క్వాలిటి కంట్రోల్ వారి కమీషన్ ఉన్నదని చెబుతున్నారు. అధికారుల అండదండలు లేనిదే పట్టపగలు చెరువులలోని నల్లమట్టి, గుట్టలలోని గ్రావెల్, సుద్ద మట్టి ఇష్టానుసారంగా ఎలా తీసుకుపోతారని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ముద్దనూరు రోడ్డులో, గండికోట రోడ్డుపై, గుడారమ్మ చెరువులలో మట్టి, గ్రావెల్ తీసుకుపోవడంతో పెద్ద పెద్ద గుంతలతో దర్శనం ఇస్తున్నాయి. పెన్నా, చిత్రావతి, నదులలో కూడా పెద్ద ఎత్తున ఇసుక గుంతలు కనపడుతున్నాయి. ఇలా సహజవనరులను అధికార పార్టీనాయకులు, రాయల్‌గా తోలుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సామాన్యునికి భవిష్యత్‌లో అందుబాటులో లేకుండా నేడు పచ్చని పేర్లను బూడ్చడానికి, ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికారుల పాపం కూడా కచ్చితంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఒకవైపు పచ్చని పైర్లు రియల్ ఎస్టేట్ వారి చేతుల్లోకి వెళ్లి భవిష్యత్తులో ఆహార కొరతను సృష్టించబడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
సహజ వనరులను కొల్లగొడుతున్నారు
నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సహజవనరులైన ఇసుక, గ్రావెల్‌ను కొల్లగొడుతున్నారు. ఒకవైపు గ్రావెల్, మరోవైపు పెన్నా, చిత్రావతి నదులలోని ఇసుకను విచ్చలవిడిగా ట్రాక్టర్లు, టిప్పర్లతో బయటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్ తరాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
- వి.శివకుమార్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి.
ట్రాక్టర్ పట్టుబడితే రూ.లక్ష జరిమానా
అత్యధికంగా గ్రావెల్, ఇసుకను దొంగగా రవాణా చేస్తున్నారని తమకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. గండికోట రోడ్డులో వారం నుంచి అధికంగా సుద్ద మట్టి గ్రావెల్‌ను తరలిస్తున్నారని తెలిసి తానే స్వయంగా వెళ్లి పరిశీలించాను. ట్రాక్టర్ గ్రావెల్‌తో కనపడిన రూ.లక్ష జరిమానా విధిస్తాం.
- గుర్రప్ప, తహశీల్దార్, జమ్మలమడుగు.