Jul 26,2023 21:29

జిల్లాలో 78.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన నీటిమట్టం - మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
పోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద 32.800 మీటర్లకు చేరిన నీటిమట్టం
నాగిరెడ్డిగూడెం, ఎర్రకాలువ జలాశయాలకు పెద్దఎత్తున వరద నీరు
ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల గుండెల్లో గుబులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఉదయం నుంచి వర్షానికి ఇంటి నుంచి బయటికి వెళ్లే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయానికి ఏలూరు జిల్లాలో సగటు వర్షపాతం 78.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ముసునూరు, ముదినేపల్లి, నూజివీడు, లింగపాలెం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షంతో ఏజెన్సీలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టాయగూడెం వంటి మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఎద్దువాగు, గుండేటి వాగు పొంగడంతో పలుచోట్ల కాజ్‌వేలపై నీరు చేరి రెండు మండలాల్లోనూ దాదాపు 46 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయగూడెం మండలంలోని కన్నాపురం నుంచి ఐటిడిఎకు వెళ్లేరోడ్డుపై వరదనీరు చేరడంతో జనం రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 45 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం ఉదయానికి వరదనీరు 50 అడుగులకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద 32.800 మీటర్లకు నీటిమట్టం చేరింది. వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు చింతలపూడిలో నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నాగిరెడ్డిగూడెం జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 25 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయానికి నాలుగు వేల క్యూసెక్కుల నీరు వచ్చిపడుతోంది. ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో జిల్లాలో అత్యధికంగా ప్రయివేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
పోలవరం నిర్వాసితుల్లో ఆందోళన
గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రేపాకగొమ్ము, గొమ్ముగూడెం గ్రామస్తులను పునరావాస కాలనీలకు తరలించారు. గురువారానికి వరద ఉధృతి పెరిగితే మరికొన్ని గ్రామాలను ఖాళీ చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 2022 తరహాలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో రెండు మండలాల్లోని 107 గ్రామాల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు చర్యలకు సన్నద్ధమయ్యారు.
ఖరీఫ్‌ నాట్లకు ఆటంకం
ఎడతెరిపిలేని వర్షంతో ఖరీఫ్‌ నాట్లకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వర్షాలకు పొలాల్లో నీరు పెరుగుతుండటంతో నాట్లు వేసేందుకు ఇబ్బందులు నెలకొంటున్నాయి. దీంతో బుధవారం రైతులు నాట్లు నాటని పరిస్థితి ఉంది. ముఖ్యంగా డెల్టాలో ఇంకా పెద్దఎత్తున వరినాట్లు వేయాల్సి ఉంది. వర్షంతో నాట్లు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.