Jul 19,2023 00:16

రంపచోడవరంలో గొడుగులు వేసుకొని ధర్నా కొనసాగిస్తున్న ఆశా కార్యకర్తలు,

ప్రజాశక్తి - రంపచోడవరం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంపచోడవరం జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు జోరువానలోనూ ఆందోళన చేపట్టారు. ఆశాలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద పెట్టు చేసిన నివాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. అనంతరం ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్‌.భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ అఖిలభారత నాయకులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ 8 గంటల పని విధానం అమలు చేయకుండా, కనీస వేతనం ఇవ్వకుండా ఆశా వర్కర్లతో ప్రభుత్వం గొడ్డు చాకరీ చేయిస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆశావర్కర్లపై పని భారం పెరిగిందని, అధికార పార్టీ నాయకుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
చింతూరు : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చింతూరు డివిజన్లోని ఆశా కార్మికులు చింతూరు డిప్యూటీ డిఎంహెచ్‌ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని, నాణ్యమైన సెల్‌ ఫోన్లు, 4జి సిమ్‌లు ఇవ్వాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు వర్తింపజేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. నాలుగు గంటల పాటు డిడిఎంహెచ్‌ఓ కార్యాలయం లోపల ఆశా కార్మికులు బైఠాయించారు. అయినా డిప్యూటీ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులు రాకపోవడంతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమం దగ్గరికి వచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ విషయం ఐటిడిఎ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఐటీడీఏ ఏవో రాస్తారోకో వద్దకు వచ్చి డిప్యూటీ డిఎంహెచ్‌ఓతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌, జిల్లా ఉపాధ్యక్షులు పూనెం సత్యనారాయణ, కొమరం పెంటయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆశాల శ్రమదోపిడీ చేస్తుందని, 14 యాపులు, 26 రిజిస్టర్లు ఆశా కార్మికుల నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆశా కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మణ్‌, దిలీప్‌, ఆశ యూనియన్‌ నాయకులు దారేశ్వరి, ముత్తమ్మ, శ్రీదేవి, సుజాత, నూతన, శారద, జయ, కళ్యాణి, ముత్యాల అక్క, ఉష, దుర్గ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.