పెద్ద బరుల వద్ద పందేల హుషారు.. ఖాకీల రాకతో చిన్న బరుల వద్ద పరేషాన్
ఆదివారం నుంచి నిలిచిన గుండాట, ముక్కలాట, ఇతర జూదాలు
మూడో రోజు కానరాని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు
చేతులు మారిన రూ.250 కోట్లు
ప్రజాశక్తి - ఏలూరు
రెండు జిల్లాల్లో కోడిపందేలు మూడోరోజు సోమవారం కొనసాగాయి. మొదటి రోజు కోడిపందేలతోపాటు గుండాట, కోతాట వంటివి యథేచ్ఛగా సాగగా రెండో రోజు ఆదివారం ఉదయం నుంచి కోడిపందేలు మినహా మిగిలిన అన్నింటినీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పందేలు కూడా ఆగుతాయా అనే చర్చ సాగింది. దీంతోపాటు ఆదివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో పందేలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో సోమవారం ఉదయమే పందేలు ప్రారంభమయ్యాయి. గుండాట వంటివి ప్రారంభించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి, యలమంచిలి మండలం కలగడంపూడి, భీమవరం రూరల్, ఆకివీడు మండలాల్లో వేసిన బరుల్లో పందేలు లక్షల్లో సాగాయి. ఏలూరు జిల్లాలో కొన్నిచోట్ల పందేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రధాన బరుల జోలికి పోలీసులు వెళ్లలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఉంగుటూరు మండలంలో అధికార పార్టీ నేతలకు చెందిన బరుల్లోకి, జిల్లాలోని పెద్ద బరుల వద్దకు పోలీసులు వెళ్లిన దాఖలాల్లేవు. అయితే మిగిలిన గ్రామాల్లోని చిన్నచిన్న బరులపై దాడులు చేసి గుండాట వంటి వాటిని పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. పందేలను కొన్ని చోట్ల ఆపించగా అధికార పార్టీ నేతల జోక్యం ఉన్న చోట్ల చూసీచూడనట్లు వదిలేశారు. ఆదివారం ఉదయం నుంచి గుండాట వంటివి అడ్డుకోవడం, ఏలూరు జిల్లాలో కొన్నిచోట్ల పందేలను సైతం అడ్డుకోవడంతో ప్రముఖులు, నేతలు సైతం సోమవారం పందేలకు దూరంగా ఉన్నారు. బరుల వద్దకు వెళ్లే నిర్వాహకులు గుండాట వంటివి ఆపేయడంపై ప్రశ్నించే అవకాశం ఉండటం, ప్రసార మాధ్యమాల్లో కన్పిస్తే హైకోర్టు సుమోటాగా కేసులకు ఆదేశాలు జారీ చేసి విచారించే అవకాశం ఉందనే కారణంతో ప్రజాప్రతినిధులు బరులకు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. ఏదేమైనా ఈ మూడు రోజుల్లో పందేల రూపంలోనే రూ.250 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం.
ముదినేపల్లి: మండలంలో పండుగ మూడు రోజులు కోడిపందేలు , పేకాట, గుండాట జోరుగా సాగాయి. మూడు రోజులు పోలీసులు వీటివైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. దీంతో జూదాల జాతర సాగింది. మండలంలోని అన్నవరం, పేరూరు, వడాలి, బొమ్మినంపాడు, ఈడేపల్లి, దేవపూడి గ్రామాల్లో పందేలు జోరుగా నిర్వహించారు. బరులను బట్టి బెట్టింగుల జోరు సాగింది. పెద్దబరుల్లో లక్షల్లో పందేలు కాచారు. మండలంలోని అన్ని బరులూ జాతరను తలపించాయి. పలు అపార్టుమెంట్లలో చేపల చెరువుల గట్లపై, ఇళ్లల్లో పేకాట జోరుగా నిర్వహించారు. బరులువద్ద బైక్‌లు, కార్ల పార్కింగ్‌ను చూసిన జనం నోరెళ్లబెట్టారు. బరుల వద్ద మద్యం, బిర్యానీ, చికెన్‌పకోడి, శీతల పానీయాలు అమ్మకాలు పెద్దఎత్తున సాగాయి. మొదటి రెండు రోజులు కన్నా మూడో రోజు సోమవారం పందేలు మరింత ఎక్కువగా సాగాయి. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పందెంరాయుళ్లు రెచ్చిపోయారు.
టి.నరసాపురం: సంక్రాంతి పేరుతో మండలంలో కోడి పందేలు మూడోరోజు సోమవారం జోరుగా సాగాయి. ప్రధానంగా మండలంలోని అప్పలరాజుగూడెం, బండివారిగూడెం, టి.నరసాపురం, తిరుమలదేవిపేట, బంధంచర్ల గ్రామాల్లో పందెంరాయుళ్లు యధేచ్ఛగా పందేలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ వంటి ఇతర ప్రాంతాల నుండి గ్రామాలకు వచ్చిన వారు ఉత్సాహంగా పందేల్లో పాల్గొని భారీ ఎత్తున బెట్టింగులకు పాల్పడ్డారని సమాచారం. మండలంలో రోజుకు సుమారు రూ.కోటి వరకు చేతులు మారాయని పలువురు చెప్పుకుంటున్నారు. రెండు రోజులపాటు జోరుగా సాగిన గుండాట, పేకాట వంటి జూదాలను పోలీసుల ఆదేశాలతో నిలిపివేశారని స్థానికులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పందేలను మహిళలు, యువతులు ఉత్సాహంగా తిలకించారు.
ఉంగుటూరు: మండలంలో యథేచ్ఛగా కోడి పందేలు, పేకాట మూడు రోజులపాటు సాగాయి. నారాయణపురం-గణపవరం రోడ్డు బరిలో పందేలను మాజీ మంత్రి రంగనాథరాజు, ఉంగుటూరు ఎంఎల్‌ఎ వాసుబాబు కొద్దిసేపు తిలకించారు. అన్నిచోట్లా ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు జరిగాయి. కొత్త ఉంగుటూరు, నారాయణపురం, గొల్లగూడెం, రాచూరు, చినవెల్లమిల్లి ఒక్కొక్క బరి, బాదంపూడిలో మూడు బరుల్లో కోడి పందేలు నిర్వహించారు. మొదటిరోజు పేకాట, గుండాట జరిగినా రెండో రోజు నుంచి అవి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నారాయణపురం రాజుల బరిలో బుల్లెట్ బండిని డ్రా తీసి విజేతలకు ఇవ్వనున్నారు. కొత్త ఉంగుటూరు బరిలో జూదరుల మధ్య కొట్లాట చోటు చేసుకోవడంతో ఒకరికి గాయాలయ్యాయి. నారాయణపురంలో బరిలో రూ.ఐదు లక్షల పందెం జరిగింది. మూడురోజులపాటు రూ.కోట్లు చేతులు మారాయి.
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి నేపథ్యంలో కనుమ రోజు కోడిపందేలు జోరుగా సాగాయి. సోమవారం మండలంలోని శ్రీనివాసపురం, ఎ.పోలవరం, వేగవరం, దేవులపల్లి, లక్కవరం, పంగిడిగూడెం తదితర ప్రాంతాల్లో కోళ్లకు కత్తులు కట్టి పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. అయితే ఆదివారం నుండి కోడి పందేల బరుల వద్ద గుండాట, కోతాట, లోన బయట వంటి జూద క్రీడల స్థావరాలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో ఒక వైపు నుండి జూద క్రీడల పందిళ్లను తొలగిస్తుంటే మరోవైపు నిర్వాహకులు మళ్లీ ఏర్పాటు చేసుకున్నారని పలువురు చెబుతున్నారు. జూద క్రీడల నిర్వాహకులు మాత్రం తాము అధికారులకు మామూళ్లు ఇచ్చామని ఇప్పుడు వద్దంటే నష్టపోతామని బహిరంగంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పందేలు జరగకుండా పోలీసులు నిలువరించారు. రాత్రీ పగలు ఏకధాటిగా కోడి పందేలు జరుగుతాయని ఆశించిన పందెంరాయుళ్లు, గుండాట, కోతాట నిర్వాహకులు నిరుత్సాహానికి గురయ్యారు. సోమవారం ఉదయాన్నే మళ్లీ కోడిపందేలతోపాటు జూద క్రీడల స్థావరాలు వెలిశాయి. మళ్లీ పోలీసులు అడ్డుకోవడంతో జూద క్రీడలను మాత్రం నిలిపివేశారు.
గుట్టుగా పేకాట శిబిరాలు
పట్టణంలో కోడి పందేల వద్ద గుండాట, కోత ఆటలను పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పేకాట శిబిరాలు గుట్టుగా కొనసాగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న హాలుతోపాటు శ్రీనివాసపురం రోడ్డులో ఏర్పాటు చేసిన మరో స్థావరంలో పేకాట రాత్రీ పగలు కొనసాగించారని స్థానికులు పేర్కొంటున్నారు.
లక్కీడ్రాలో శ్రీవిద్యకు బుల్లెట్
ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురం ఐస్ ఫ్యాక్టరీ వద్ద కోడి పందేల నిర్వాహకులు బుల్లెట్ బండి లక్కీ డ్రా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన పందేల్లో పాల్గొన్న వారికి రూ.మూడు లక్షల విలువైన బుల్లెట్ బండికోసం టిక్కెట్‌కు రూ.వెయ్యి చొప్పున వసూలు చేశారు. దానిపై సోమవారం డ్రా తీయగా నిడమర్రు మండలం పత్తేపురానికి చెందిన పత్సమట్ల శ్రీవిద్యకు బుల్లెట్ బండి దక్కింది. ఈసందర్భంగా బండిని విజేత శ్రీవిద్య తండ్రికి నిర్వాహకులు అందజేశారు.










