చంద్రబాబు పర్యటనతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం
చింతలపూడి, పోలవరంల్లో గ్రూపు తగాదాలపై వీడని ఆందోళన
నూతన విధానం పేరిట వరి రైతులతో ప్రభుత్వ చెలగాటం
టిడిపి అధినేత చంద్రబాబు పర్యటన జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపింది. దెందులూరు, చింతలపూడి, పోలవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మీదుగా సాగిన పర్యటనలో ఆయా ప్రాంతాల్లో ప్రధాన సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబు ప్రసంగాలు సాగడం ఆయా ప్రాంత టిడిపి కార్యకర్తలను, నేతలను ఉత్తేజపరిచింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు, ధాన్యం రైతుల సమస్యలు తన ప్రసంగంలో ప్రస్తావించారు. అదే సమయంలో చింతలపూడి, దెందులూరు ఎంఎల్‌ఎలపై నేరుగా విమర్శనాస్త్రాలను సంధించారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు తన ప్రభుత్వం హయాంలో చింతలపూడి, పోలవరం నిర్వాసితుల ఊసే మరిచిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతమెలాగున్నా రానున్నకాలంలో అధికారంలోకొస్తే నిర్వాసితులను ఎలా ఆదుకుంటారనేది స్పష్టంగా చెప్పకపోవడంపై బాధిత ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు అంశంగా 70 శాతానికిపైగా పనులు తామే పూర్తి చేశామని చెబుతున్న చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం, పరిహారంపై పెద్దగా నోరు మెదపకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. తన చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తానని పదేపదే చెబుతున్న చంద్రబాబు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం, పరిహారం అందిస్తామని ఎక్కడా స్పష్టం చేయకపోవడం చర్చనీయాంశమైంది. అంటే గతంలో వలె ప్రాజెక్టు పూర్తిపైనే దృష్టి సారించడం తప్ప నిర్వాసితులను గతంలో వలె, ఈ ప్రభుత్వం తరహాలో గాలికొదిలేస్తారని అర్థమవుతోందని నిర్వాసితుల నేతలు చెబుతున్నారు. ఇక చింతలపూడి భూనిర్వాసితులు పట్టిసీమ తరహా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దానిపై నాడు.. నేడు కూడా ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో దెందులూరు నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల ఆ ప్రాంత నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడమూ చర్చనీయాంశమైంది. పెదవేగి మండలం విజయరాయిలో దెందులూరు మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్‌కు అవకాశం ఇచ్చారు. అయితే చింతలపూడిలో మాజీ మంత్రి పీతల సుజాతకుగాని, పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మాజీ ఎంఎల్‌ఎ మొడియం శ్రీనివాస్, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బొరగం శ్రీనుకుగాని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఈ రెండుచోట్ల మాజీ ఎంపీ మాగంటి బాబుకే మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీలోని గ్రూపుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వల్లే స్థానిక నేతలకు అవకాశం కల్పించలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన సమావేశాలను సైతం సుజాత గ్రూపు నేతలు, మాగంటి బాబు గ్రూపు నేతలు వేర్వేరుగా నిర్వహించడం గమనార్హం. ఇక పోలవరం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఇరు గ్రూపులకు అవకాశం కల్పించకుండా చంద్రబాబు పర్యటన సాగించినా రానున్న రోజుల్లో ఆ గ్రూపు విబేధాలు సమసిపోయేలా చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమేనని ఆ పార్టీ శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇక చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటన అంతా చింతమనేని ప్రభాకర్ తానై నడిపించారు. గతంలోనూ గోదావరి వరదల సందర్భంగా విలీన మండలాల్లో పార్టీ తరఫున సాయమందించే కార్యక్రమాల్లో ఆ నియోజకవర్గ నేతలతో సంబంధం లేకుండానే నేరుగా పాల్గొన్నారు. మొత్తంగా పరిణామాలన్నీ చూస్తే రానున్న ఎన్నికల్లో చింతమనేని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సమస్యల సుడిలో ధాన్యం రైతు
వరిసాగు ఆరంభం నుంచి పంట చేతికొచ్చే వరకూ ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు అల్లాడేవారు. పంట చేతికొచ్చాక ధర సమస్య తప్ప అమ్మకం, సొమ్ము చేతికందడం వంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. ప్రభుత్వాల విధానాల ఫలితంగా సాగు ఆరంభం నుంచి ధాన్యం విక్రయించి సొమ్ము చేతికొచ్చే వరకూ అడుగడుగునా రైతులను సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా తాము వరి సాగు చేస్తున్నామా.. సమస్యల సాగు చేస్తున్నామా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడే దుస్థితి దాపురించింది. ప్రధానంగా చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు నానావస్థలు పడుతున్నారు. గోనె సంచుల కొరత, తేమ శాతం నిబంధనలు ఇప్పటికే రైతులను వేధిస్తుండగా తాజాగా లారీల సమస్య తీవ్ర రూపం దాల్చడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. సొమ్ము మాటెలాగున్నా ధాన్యం మిల్లుకు ఎప్పుడు చేరుతుందా అని రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో ఇప్పటికే వరిసాగుకు దూరమవుతున్న రైతులు ప్రస్తుత పరిస్థితులతో మరింత బేజారెత్తి సాగుకు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










