గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో గత వారం రోజుల పాటు విస్తారంగా వానలు కురవడంతో రైతన్నలు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. మంగళ, బుధవారాల్లో రెండు రోజులు వ్యవధిలో కురిసిన భారీ వర్షంతో జిల్లాలో 55 శాతం వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో చెరువులు, పొలాలు నిండుకుండలా మారాయి. మన్యం జిల్లాలో 15 మండలాల్లో లక్షా 80,000 ఎకరాల్లో వరి సాగు అవుతుంది. ఆలస్యంగా వర్షాలు కురిసినా ఖరీఫ్ పనులు ప్రారంభానికి సరిపడినంత వర్షపాతం నమోదు కావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం, పార్వతీపురం, గరుగుబిల్లి, వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస మండలాల్లో దమ్ములు, వరినాట్లు జోరందుకున్నాయి. 20శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు నాటికి వరి నాట్లు పూర్తవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో పలుచోట్ల రైతులు ఎక్కువ శాతం ఎదలు జల్లు కున్నారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయానికి వర్షం ఎంతగానో అనుకూలంగా ఉంటుందని గిరిజన రైతులు చెబుతున్నారు. గిరిజన మండలాలైన గుమ్మలక్ష్మీపురం, కురుపాం ప్రాంతాల్లో రైతులు వర్షాధారంపై ఆధారపడి ప్రతి ఏడాది పంటలు పండిస్తుంటారు. చెక్ డ్యాములు, మినీ రిజర్వాయర్లు, సాగునీటి వనరులు ఉన్నా నిర్వహణ లోపంతో పూర్తిగా పడకేశాయి. జియమ్మవలస, గరుగుబిల్లి మైదాన ప్రాంతంలో వర్షాధారం, సాగునీటి వనరులు ద్వారా వచ్చే నీటితో పంటలు వేస్తుంటారు. తోటపల్లి ఎడమ కాలువ నీరు విడుదలతో జిఎంవలస, గరుగుబిల్లి మండలాల్లో పంట పొలాలకు నీరు పుష్కలంగా అందుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు జీడి, చింతపండు ప్రధాన పంటలైనప్పటికీ తరతరాల నుంచి పోడు వ్యవసాయంలో కంది, పత్తి, బొబ్బర్లు, జనుములు, చోడి పంటలను గిరిజనులు ఎక్కువగా పండిస్తున్నారు. ఖరీఫ్ పనులు ముమ్మరంగా జరుగుతున్న దృష్ట్యా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సకాలంలో పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.










