
ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 9వ వార్డు పరిధి జోడుగుళ్లపాలెంలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి సమన్వయకర్త వైవి.సుబ్బారెడ్డి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, కొత్తగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఎంవివి.సత్యనారాయణ ముందుగా జోడుగుళ్లపాలెంలోని కొత్త అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. పథకాలు ప్రజలకు అందుతున్న తీరును, స్థానిక సమస్యలనడిగి తెలుసుకున్నారు. అనంతరం వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖ నగరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా రానున్న తరుణలో విశాఖ నగరాన్ని భవిష్యతో మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తూర్పు నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎంవివి.సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.