రాహుల్‌ను కలిసి సమస్య విన్నవించనున్న కార్మిక నేతలు
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు మద్దతునివ్వాలని జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీని కలిసి, విన్నవించేందుకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం కూర్మన్నపాలెం కూడలిలో పోరాటకమిటీ నేతలు తరలివెళ్లే బస్సును విశాఖ ఉక్కు మాజీ ఉన్నతాధికారి కెకె రావు ప్రారంభించారు. భారత్ జూడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం మధ్యాహ్నం రాహుల్ గాంధీని కలిసేందుకుఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. రాహుల్ గాంధీని కలిసినందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ మాజీ ఎంపి జెడి శీలం, ఎపిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ చేశారన్నారు. ఈ మేరకు పోరాట కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కెకె రావు మాట్లాడుతూ కార్మికుల పోరాటానికి అన్ని రాజకీయపార్టీల మద్దతు అవసరమన్నారు. మూడు లక్షల కోట్ల సంపద ప్రయివేటుకు ధారదత్తం కాకుండా కాపాడుకునేందుకు పోరాడుతున్న కార్మికులకు అన్ని వర్గాల నుంచి మద్దతు, సహకారం అవసరమన్నారు. 600రోజులకుపైగా ఏకధాటిగా కార్మికులు చేస్తున్న పోరాట ఫలితంగానే స్టీల్‌ప్లాంట్ జోలికి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాహసించడం లేదన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి, కేంద్రంనిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు
ప్రభుత్వం సహకారం అందించకపోయినా 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.4 మిలియన్ టన్నుల ఉత్తత్తి సామర్థ్యానికి సొంత నిధులతోనే విస్తరించుకున్నామన్నారు. ప్రభుత్వం చెబుతున్న అప్పులకు మూడు రెట్లు విలువైన సంపద విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉందని,కేంద్రం పునరాలోచించాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరామ్, గంధం వెంకట్రావు, జె.రామక్రిష్ణ, గణపతి రెడ్డి, వై మస్తానప్ప, విళ్ళ రామ్మోహన్‌కుమార్, కరణం సత్యారావు, డివి రమణారెడ్డి, వరసాల శ్రీనివాస్, మంగ వెంకట్రావు, ఎల్ వి రమణ, నెల్లి అప్పలరాజు, టి జగదీష్, గుమ్మడి నరేంద్ర పాల్గొన్నారు.










