Oct 17,2023 20:52

విత్తనం వేసిన జొన్న చేనికి నీళ్లు పెట్టిన దృశ్యం

జొన్న పొలంలోకి సాగునీరు
- 6 ఎకరాల్లో మొలకెత్తని విత్తనం
- రూ. 2 లక్షలు నష్టపోయిన కౌలు రైతు

ప్రజాశకి - బండి ఆత్మకూర్‌ : 
మండలంలోని పరమటూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కావేటి మధు పరమటూరు గ్రామానికి చెందిన రేగటి రంగస్వామి రెడ్డికి చెందిన ఆరు ఎకరాల బీడు పొలాన్ని కౌలు తీసుకొని రెండు రోజుల క్రితం జొన్న పంట సాగు చేశాడు. బీడు పొలాన్ని సాగు చేసుకునేందుకు, జొన్న విత్తనం వేసేందుకు పెట్టుబడి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. అయితే పక్కనున్న పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్న గందివేముల శ్రీనివాసులు అతని పొలానికి సాగు నీరు పెట్టుకుంటూ పక్కనున్న ఆరు ఎకరాల భూమిలోకి నీళ్లు వదిలాడు. దీంతో కావేటి మధు వేసిన జొన్న విత్తనం మొలకెత్తకుండా తీవ్ర నష్టం వాటిల్లింది. తన పొలానికి నీళ్లు ఎలా పెట్టావని శ్రీనివాసులును అడగగా తనకు ఏమీ తెలియదని, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని బాధిత కౌలు రైతు కావేటి మధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పేద రైతునైన తాను కౌలు తీసుకున్న పొలానికి ముందుగానే కౌలు చెల్లించానని, ప్రస్తుతం జొన్న విత్తనం మొలకెత్తక పోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, తనకు పోలీస్‌ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నాడు.