ప్రజాశక్తి-అనకాపల్లి
ఆహార పంటల్లో జన్యు మార్పిడి టెక్నాలజీని నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సురక్షిత ఆహార దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఆహార పంటల ఉత్పత్తిలో జన్యు మార్పిడి సాంకేతికతను చొప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను, తాజాగా ఆవాలలో జన్యు మార్పిడిని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తున్నప్పటికీ కేంద్రం హడావుడిగా ఈ పంటను క్షేత్రస్థాయిలో పరిశోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తనాలను సరఫరా చేసిందని తెలిపారు. 10 సంవత్సరాల కిందటే జన్యు మార్పిడి విత్తనాలు, కలుపును తట్టుకునే టెక్నాలజీపై సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్ కమిటీ చేసిన హెచ్చరికలను కేంద్రం పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. బహుళ జాతి సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్రం ఈ చర్యలకు పూనుకుంటుందని విమర్శించారు. దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, రైతు సంఘాల ప్రతినిధులు కొల్లి సత్యారావు, ఏడుకొండలు పాల్గొన్నారు.










