ప్రజాశక్తి- బుచ్చయ్యపేట
మండలంలోని పలు గ్రామాల్లో జనుము సాగు ముమ్మరంగా చేపట్టి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఖరీఫ్ వరి పంట కోత దశలో ఉన్నప్పుడు పంట పొలాల్లో జనుము విత్తనాలను చల్లుతారు. అనంతరం వరి పంటను కోత కోసిన కొద్ది కాలానికి జనుము మొలకెత్తుతుంది. తక్కువ ఖర్చుతో రైతులకు లాభాలను ఇచ్చే జనుము సాగును మండలంలోని వడ్డాది, చిన్నప్పన్నపాలెం, రాజాం, బుచ్చయ్యపేట, దిబ్బది, నీలకంఠాపురం తదితర గ్రామాల్లో అధికంగా రైతుల చేపట్టారు. సాధారణంగా ఖరీఫ్ వరి పంటకు ముందు జనుము విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తర్వాత దానిని దమ్ములో దున్నుతారు. దీని వల్ల వరి పొలం సారవంతమై అధిక దిగుబడులు రావడానికి ఈ జనుము ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొద్ది సంవత్సరాలుగా మండలంలోని రైతులు జనుము పంటను ఆదాయం పంటగా మార్చుకున్నారు. ఖరీఫ్ అనంతరం వరి పొలాల్లో దీనిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వందలాది ఎకరాల్లో జనము పూతదశలో ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా పురుగుల మందు బాధ పెద్దగా లేకుండా ఈ పంట పండుతుంది. ఎకరాకు సుమారు రూ.10వేలు వరకు జనుము సాగు వల్ల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో జనుము రూ.60 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
మినప పంటకు తెగుళ్లు
ఖరీఫ్ వరి సాగు అనంతర పంట పొలాల్లోనే చల్లే మినప సాగును కూడా మండలంలో వందల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. నెలల రోజుల కితం కోసిన వరి పంట అనంతరం రైతులు మినప విత్తనాలను వరి పొలాలలో చల్లారు. అయితే ఈ ఏడాది మినప సాగుకు తెగుళ్ల బెడద పట్టుకుంది. మినప మొక్కలు పూత తక్కువగా ఉండడం, పూత నిలబడకపోవడం, ఆకు ముడుచుకుపోవడం తదితర కారణాలతో మినప సాగుకు ఆశాజనకంగా లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మినప పంటపై పురుగుల మందును పిచికారీ చేస్తున్నారు.










