ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జనసేన పొత్తుతో జిల్లాలో టిడిపి తరపున ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో గుబులు మొదలైంది. జిల్లాలో జనసేన ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు అడుగుతుంది? ఆ మాటకొస్తే ఉమ్మడి జిల్లా వరకు వస్తుందా? లేక కేటాయించిన కోటా సీట్లను మన జిల్లా కన్నా బలంగా ఉన్న విశాఖ, గోదావరి తదితర జిల్లాల్లోనే భర్తీ చేసుకుంటుందా? ఇదీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న చర్చ. ఎన్నికల పొత్తుపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రకమైన చర్చ జిల్లాలో ముమ్మరంగానే సాగుతోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన సొంతంగా గెలిచే శక్తిలేదు. పొత్తులో భాగంగా జిల్లాలో పోటీకి తలపడదామనుకుంటే నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాలు గానీ, లేదా ఇందులో ఒకటిగానీ అడిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయనగరం, బొబ్బిలిలో జనసేనకు చురుకైన నాయత్వం ఉన్నప్పటికీ ఈ రెండు చోట్ల టిడిపి నుంచి అత్యంత క్రీయాశీలకంగా ఉంటూ పార్టీలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకులు ఉన్నారు. వీరిలో ఒకరు విజయనగరానికి చెందిన కేంద్ర మాజీమంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీనాయన లేదా మాజీమంత్రి సుజరుకృష్ణ రంగారావు ఉన్నారు. ఇద్దరు రాజవంశీయులను పక్కనబెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి టిడిపిలో లేదు. అలాగని జనసేన పట్టుబట్టి అడగడానికి స్వయంశక్తి సరిపోని పరిస్థితి దాపురించింది.
గత ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి జనసేన పోటీలో నిలిచింది. కొద్దోగొప్ప పార్టీ కార్యకలాపాలతో నడుస్తోంది. గజపతినగరంలో మాజీ మంత్రి పడాల అరుణ ఇటీవల జనసేనలో చేరారు. చాలా కాలంగా కార్యకర్తలు ఉన్నారు. దీనికితోడు మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే జనసేన హడావుడి కాస్త ఉందనే చెప్పుకోవచ్చు. ఈ రెండు నియోజవర్గాల్లోనూ టిడిపి నాయకుల్లో గ్రూపు రాజకీయాలు చాలా కాలంగా సాగుతున్నాయి. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో ఇంతకన్నా బలంగా ఉన్న పరిస్థితేమీ లేదు. ఈ నేపథ్యంలోనే గజపతినగరం, నెలిమర్ల లేదా వీటిలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీకి జనసేన ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, టిక్కెట్లు ఆశిస్తున్న ఇతర నాయకుల్లో లోలోపల గుబులు మొదలైంది. గజపతినగరం నుంచి టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఈసారి కూడా తనకే టిక్కెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఈసారి టిడిపి అధినేత చంద్రబాబు యువతకు ప్రాధాన్యత ఇస్తారని, ఆ లెక్కన తన కుమారుడికి వస్తుందంటూ అప్పలనాయుడు సోదరుడు కొండబాబు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ హామీతోనే ఇటీవల అంతా కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లామని కూడా తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టు సమాచారం. మరోవైపు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ జగపతిరాజు ద్వారా కరణం శివరామకృష్ణ కూడా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటు నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన కర్రోతు బంగార్రాజు ఆశతో ఉన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కూడా తన కుమారులకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేనతో కుదిరిన పొత్తుతో ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన ఆశావహుల రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడినట్టేనన్న చర్చ నడుస్తోంది. జనసేన కోటా విజయనగరం వరకూ రాకపోతే ఏ సమస్యా ఉండకపోవచ్చని కూడా విశ్లేషకులు వెలువడుతున్నాయి.










