Nov 04,2023 21:42

ఫొటో : వినతిపత్రం స్వీకరిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

జనరంజకంగా ముఖ్యమంత్రి పాలన
ప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండలంలోని లింగంగుంట సచివాలయం పరిధిలో రెండోరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గార్లదిన్నెపాడు, ఇనగలూరు గ్రామాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు నిర్మాణ విషయమై గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకు రావడంతో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 7వ తేదీన జిల్లా కలెక్టర్‌తో రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నామని వారికి హామీనిచ్చారు.
పలువురు పాత్రికేయులు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించాలని ఎంఎల్‌ఎ మేకపాటికి విన్నవించడంతో పరిశీలించి స్థలం మంజూరుకు కృషి చేస్తానని వారికి హామీనిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు అయిన ఇనగలూరు గ్రామంలోని శ్రీ మల్లెంకొండేశ్వరస్వామి అంకమ్మ తల్లి గుడి నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నియోజకవర్గంలో 58 దేవాలయాలకు రూ.580 లక్షల నిధులు మంజూరు చేయించానని, నియోజకవర్గంలో తొలి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇనగలూరు గ్రామంలో ప్రారంభోత్సవం చేసినట్లు వివరించారు. మిగిలిన దేవాలయాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మండలంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాధితులకు వాటిని అందచేశారు. పడమటికంభంపాడుకు చెందిన ముక్కు వరలక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, వీరికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4లక్షల చెక్కును, ఉప్పలపాడుకు చెందిన మాదిరెడ్డి విజయశాంతికి మంజూరైన రూ.2లక్షల చెక్కును అందజేశారు. వైసిపి నాయకులు బట్రెడ్డి జనార్థన్‌ రెడ్డి తంఢ్రి తిరుపాల్‌ రెడ్డి ఇటివల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను ఎంఎల్‌ఎ వారి నివాసానికి వెళ్లిన తిరుపాల్‌ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, పలు శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.