Nov 29,2022 23:57

మానవహారం చేస్తున్న మిడ్డేమీల్స్‌ కార్మికులు, శానిటేషన్‌ వర్కర్లు

ప్రజాశక్తి-చోడవరం రూరల్‌
మండలంలో జన్నవరం జెడ్‌పి హైస్కూల్‌లో ఆరేళ్లగా పనిచేస్తున్న శానిటేషన్‌ వర్కర్‌ ఎ.వరలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం, శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన స్థానిక కొత్తూరు జంక్షన్‌లో మంగళవారం మానవహారం చేపట్టారు. దీనికి ముందు స్థానిక ఎంఇఒ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు న్యాయం చేయాల్సిన గ్రామ సర్పంచ్‌, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక వృద్ధురాలి పొట్ట కొట్టి వాళ్ళ పొట్ట నింపుకోవడం సిగ్గు చేటన్నారు. స్కూల్‌ కమిటీ చైర్మన్‌ బాత్‌ రూమ్‌లు కడుక్కుని బతికే వర్కర్‌ని తొలగించి తన భార్యను నియమించుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితురాలు వరలక్ష్మికి న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.బుచ్చిరాజమ్మ, అప్పియ్యమ్మ, చింతల్లి, అమీనా, శానిటేషన్‌ వర్కర్స్‌ వరలక్ష్మి, అచ్చియ్యమ్మ, దేవి, మేరీ, పరదేసమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.