ప్రజాశక్తి-పంగులూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం అయిన వారికి జననీ సురక్ష యోజన పథకం వర్తిస్తుందని, ఈ పథకం కింద బాలింత సంరక్షణకు రూ.ఐదు వేలు ఇస్తారని పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. శనివారం పంగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, 13వ సాధారణ ప్రసవాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జునరావు తల్లీ బిడ్డ పౌష్టికాహారం కోసం రూ.5,000 అందజేశారు. వైఎస్సార్ బేబీ కిట్టు కూడా బాలింతకు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ బాలింతకు, వారికి సహాయంగా వచ్చిన వారికి టిఫిన్, భోజనం ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన బిడ్డకు టీకాలు, జనన ధ్రువీకరణ పత్రం ఇస్తున్నట్లు తెలిపారు. కావలసిన మందులు కూడా ఏర్పాటు చేస్తున్నామని, రెండు రోజుల పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశీలన నిమిత్తం ఉంచుతున్నామని చెప్పారు. మండల ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో జరిగే ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివ చెన్నయ్య, స్టాఫ్ నర్స్ క్రాంతి, సంధ్యారాణి, శివ, మార్త, సూపర్‌వైజర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.










