Sep 25,2021 06:16

   దేశంలో చమురు ధరలు తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఈ నెల 23న చేసిన ప్రకటన మోడీ సర్కార్‌ నయవంచనకు మరో తార్కాణంగా నిలుస్తుంది. పెట్రో ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు అంగీకరించనందున పెట్రో ధరలు తగ్గవన్నది ఆయన వాదన. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా హర్‌దీప్‌ చేసిన ఈ వ్యాఖ్యల ఉద్దేశం ప్రజలను తప్పుదోవ పట్టించడమే తప్ప మరొకటి కాదు. జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు చేర్చితే రాష్ట్రాలకు ఉన్న ప్రధాన ఆర్థిక వనరు అడుగంటిపోతుంది. ప్రతి అవసరానికి కేంద్రాన్ని యాచించాల్సిన దుస్థితి నెలకొంటుంది. రాష్ట్రాలను ఆర్థికంగా చితికిపోయేలా చేసి కేంద్రానికి పావులుగా మల్చుకోవాలనే ఆర్‌ఎస్‌ఎస్‌ సైద్ధాంతిక ఎత్తుగడలో భాగంగానే మోడీ సర్కార్‌ ఈ వంచనలకు పాల్పడుతోంది.
     పెట్రోలు ధరలు తగ్గించాలన్న చిత్తశుద్ధి కేంద్రానికి ఉంటే ఆ పని కేంద్రం నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే పెట్రోలు, డీజిలుపై రాష్ట్రాల కంటే అధిక మొత్తంలో పన్ను భారాలు మోపుతున్నది కేంద్రమే కనుక. 2014లో లీటరు పెట్రోల్‌ పై రూ.9, లీటరు డీజిల్‌ పై రూ.3 ఉన్న కేంద్ర పన్నులు ఇప్పుడు రూ.33, రూ.32కు చేరాయి. దీనికి తోడు కేంద్రం వేసే పన్నులలో సెస్‌ను భారీగా పెంచేశారు. ఈ సెస్‌ వసూళ్ళ నుంచి రాష్ట్రాలకు పైసా కూడా వాటా ఉండదు. ఈ మొత్తం కేంద్రం ఖాతాకే చేరుతుంది. వంట గ్యాసు సిలిండరు ధర రూ.400 ఉండగా అదిప్పుడు రూ.950కి ఎగబాకింది. తొలుత సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను పరిమితం చేసిన కేంద్రం ఆ తర్వాత క్రమంగా రాయితీని పూర్తిగా ఎత్తేసింది. ఇలా చమురు ఉత్పత్తులపై పన్నులు రూపంలో ప్రతి యేటా దాదాపు రూ.4.5 లక్షల కోట్లు దండుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధరాఘాతానికి కారణం రాష్ట్రాలేనంటూ అభాండాలు వేయడం సిగ్గుచేటు.
    ముడి చమురు విషయంలోనే కాదు..పామాయిల్‌, పప్పు ధాన్యాలు, కుటుంబ పోషణకు అవసరమయ్యే నిత్యావసర సరుకులపైనా దిగుమతి సుంకాలు, ఎక్సైజ్‌ సుంకాలు పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రజల సంక్షేమం కోసమే పెట్రో సుంకాలు పెంచాల్సి వచ్చిందని చెప్పుకున్న ఇదే మోడీ సర్కార్‌ కోవిడ్‌ బారినపడి మరణించినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారం కూడా రాష్ట్రాలే ఇవ్వాలని చేతులు దులిపేసుకుంది. లాక్‌డౌన్లతో చితికిపోయిన సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఇ)లు దివాలా తీసే దుస్థితిలో ఉన్నా కేంద్రం ఆసరా ఇచ్చింది లేదు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ కట్టడికి ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ రైల్వేశాఖ భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినా నేటికి పరీక్షలు నిర్వహించడం లేదంటే యువతరమంటే మోడీ సర్కార్‌కు ఎంత చులకనో అర్థం చేసుకోవచ్చు. మరి పన్నుల రూపంలో ప్రతి యేటా లక్షల కోట్ల రూపాయలను బొక్కసంలో వేసుకుంటున్న కేంద్రం ఆ సొమ్ము ఎవరి ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోంది? అది బ్రహ్మరహస్యమేమీ కాదు. పన్ను రాయితీలు, ఉద్దీపన ప్యాకేజీలతో ఆ సొమ్ము అంతా కార్పొరేట్‌ బొక్కసాలకు తరలిస్తోంది. కోవిడ్‌ విపత్తు సమయంలోనూ అదానీ, అంబానీల ఆస్తులు అమాంతం పెరిగిపోవడానికి ఇదే కారణం.
    వేర్లు బలంగా ఉంటేనే చెట్టు మనుగడ సాధ్యమన్న ఇంగితం కూడా మరిచిన కేంద్ర ప్రభుత్వం దేశానికి మూలాలైన రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతదేశ విశిష్ట లక్షణాలను కాలరాస్తూ 'ఒకే దేశం-ఒకే విధానం' ముసుగులో సమాఖ్య స్ఫూర్తిని మంటగలుపుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, విద్యుత్‌ రంగాలతో పాటు, గ్రామ పంచాయితీలు, సహకార రంగంలోనూ జొరబడుతోంది. మెజార్టీ రాష్ట్రాలు 'వద్దు మొర్రో' అని మొత్తుకున్నా అప్రణాళికాయుతంగా జిఎస్‌టిని రుద్దింది. జిఎస్‌టి తీసుకొచ్చే క్రమంలో రాష్ట్రాలకు నష్ట పరిహారంగా చెల్లిస్తామన్న సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించడం లేదు. దాదాపు ఎగవేసిందనే చెప్పాలి. జిఎస్‌టి బకాయిల కోసం మోడీ, అమిత్‌షాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు మోడీ సర్కార్‌ వినాశకర విధానాలపై గళాలెత్తి నిలదీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రాల ప్రయోజనాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బతీయడమేగాక ఇప్పుడు పెట్రో మంటలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో ఆ రాష్ట్రాలనే దోషులుగా నిలబెట్టాలని చూస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, సవాలు చేయడం రాష్ట్రాల్లో ఉన్న పార్టీల బాధ్యత. బిజెపి వంచనల వలయంలో చిక్కుకోకుండా రాష్ట్రాలు తమ హక్కుల కోసం, వనరుల పరిరక్షణ కోసం కేంద్రంపై ఉమ్మడి పోరు సల్పాలి.