గడ్డకట్టిన హిమానీ నదంలా ఉన్నారు
గోడకు కొట్టిన మట్టి బంతుల్లా ఉన్నారు
ఆరిపోయిన నిప్పుగుండంలా ఉన్నారు
సంకెళ్లను పిడికిళ్లతో కొట్టిన జనం
తుపాకీ గుండ్లను తుపుక్కున ఊసిన జనం
కంచెలను తెంచిపారేసిన జనం
ఉద్యమాలకు ఊపిరిపోసిన జనం
రాజ్యం చేసే అప్పుల మీద
పెద్దగా దిగుల్లేదు
కుర్చీలు చేసే తప్పులేమీ
కనిపించడం లేదు
చూస్తుండగానే రైతు ఉద్యమం
నీళ్లులేని పైరులా ఎండుతోంది
నిండా మునిగిపోతున్నా
ఎక్కడా చింత లేదు
ఎండాకాలం ఉష్ణోగ్రత రోజూ ఎగబాకినట్టు
పెరుగుతున్న పెట్రోల్ ధరపై ఆగం లేదు
రాజ్యమిప్పుడో
బడా వ్యాపారి
క్రయవిక్రయాల దీపదారి
ఏ కంట్లోను ఎర్రచారికల్లేవు
పదునెక్కిన స్వరపేటికల్లేవు
రక్తాన్ని పురమాయించి
కదం తొక్కించిన
నెత్తుటిపాట లేదు
ఒక నిర్బంధమేదో వెంటాడుతోంది
రక్తంతో పొలం పండించిన జనం
కలుపు తీసిన జనం
కొండల్ని పిండిచేసిన జనం
పల్లేరు కాయల్ని
తొక్కి పారేసిన జనం
మోట తొక్కిన జనం
గడిచిన కాలాల్లో
అలలై లేచిన జనం
గాయాల పూలై పూచిన జనం
పాతేసిన రాళ్లులా ఉన్నారు
కట్టేసిన జీవంలా ఉన్నారు
డాక్టర్ సుంకర గోపాలయ్య
85559 71630