May 29,2022 09:17

ఉదయం పదిగంటలైంది.
కౌమోదకి కాలేజీకి వెళ్లడానికి తయారవుతోంది.
'ఏమ్మా! పదైపోయింది, ఇంకా బయలుదేరలేదా?' అని అడిగాడు గంగాధరం.
'బయలుదేరుతున్నాను తాతా! చక్రధర్‌ కోసం చూస్తున్నా' అంది.
'రోజూ ఇంతే, అరగంట ముందు వెళ్లొచ్చు. బొత్తిగా క్రమశిక్షణ లేదు' అన్నాడు కోపంగా.
గంగాధరం స్వాతంత్య్ర సమరయోధుడు. అతని తండ్రి స్వరాజ్యరావు కూడా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆ పోరాటంలో రెండుసార్లు బ్రిటిష్‌ ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టింది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జానకిని పెళ్లిచేసుకున్నాడు. పల్లెటూళ్లోని తన తండ్రి తదనంతరం వ్యవసాయాన్ని కొనసాగించాడు. పెళ్లయిన ఐదేళ్లకు రఘురాం పుట్టాడు. రఘురాం బి.ఈడి చదివి, ఆ ఊళ్లోనే ఉపాధ్యాయుడిగా చేరాడు. ఉద్యోగం రాగానే అంజలితో పెళ్లయ్యింది. తరువాత పుట్టిన మనవరాలికి గంగాధరం 'కౌమోదకి' అనీ పేరు పెట్టాడు. దురదృష్టవశాత్తూ వాళ్లు స్నేహితుడి పెళ్లికి వెళుతున్నప్పుడు కారు ప్రమాదంలో మరణించారు. కౌమోదకిని తానే తల్లీతండ్రై పెంచుతున్నాడు గంగాధరం.
పదేళ్ల క్రితం భార్య జానకి చనిపోవడంతో మనవరాలి చదువు కోసం విశాఖపట్నం వచ్చేశాడు. అప్పట్నుంచీ అతనూ, మనవరాలు ఫ్లాట్‌లో ఉంటున్నారు. రాను రాను వయసు మీద పడటంతో గంగాధరం ఇంటికే పరిమితమైపోయాడు. కౌమోదకి గంగాధరానికి వేళకి మందులిస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది. కాకపోతే ఆమె కాలేజీకి వెళ్లిన తరువాత అతనికి సమయం గడిచేది కాదు. చాలాసేపు టీవి చూస్తాడు. ఆ తరువాత భోజనం చేసి, పడుకుంటాడు. సాయంత్రం వేళ వరండాలోకొచ్చి ఎదురుగా కనిపించే రోడ్డు మీద వచ్చేపోయే జనాలను చూస్తూ సమయాన్ని గడుపుతాడు. అక్కడ నుంచి కౌమోదకి కోసం ఎదురుచూపు.
ఇంటర్మీడియెట్‌ దాకా త్వరగానే వచ్చేసేది మనవరాలు. కానీ డిగ్రీలో చేరాక ఆలస్యమవుతోంది. రెండేళ్ల నుంచి కౌమోదకి ఎవరో అబ్బాయితో స్నేహం చెయ్యడాన్ని గమనించాడు గంగాధరం. మెల్లగా ఆ అబ్బాయి పేరు చక్రధరం అనీ, అతనూ కౌమోదకి కలిసి చదువుకుంటున్నారనీ, వాళ్లిద్దరూ స్నేహం దాటి ప్రేమలో పడ్డారనీ తెలిసి, గాబరాపడ్డాడు గంగాధరం. చక్రధరం పేరు వింటేనే కోపం వచ్చేది. కానీ ఎప్పుడూ బయటపడడు. గంగాధరం ఎవ్వర్నీ అంత తేలిగ్గా నమ్మే వ్యక్తి కాదు. మనవరాలు మోసపోతుందన్న భయంతో అతను చక్రధరాన్ని నిశితంగా గమనించసాగాడు.
ఇంతలో ఇంటి ముందు బైక్‌ ఆగింది. దాని మీద చిద్విలాసంగా చక్రధర్‌. అతన్ని చూడగానే 'ఈరోజు ఆలస్యమైందే? తాతా తలుపేసుకో' అంటూ పరుగున వెళ్లిపోతున్న కౌమోదకిని నిస్సహాయంగా చూస్తూ తలుపు వెయ్యడానికి లేచాడు గంగాధర్‌. ఇలా వారంలో ఐదు రోజులు జరుగుతుంటుంది.
ఆ రోజు ఆదివారం. ఉదయాన్నే వచ్చాడు చక్రధరం. ఆ సమయంలో కౌమోదకి స్నానం చేస్తోంది. గంగాధరం హాల్లో పేపరు చదువుకుంటూ ఉంటే నమస్కారం పెట్టి, సోఫాలో కూర్చున్నాడు చక్రధరం. గంగాధరానికి చాలా రోజుల నుంచీ చక్రధరంతో మాట్లాడాలని ఉంది. కౌమోదకి ఉండటంతో ఒంటరిగా అతను దొరకటం లేదు. 'చక్రం! కాలేజీ రోజుల్లో అంటే ఫర్వాలేదు. ఇలా నువ్వు ఆదివారాల్లోనూ వస్తే ఎలా? అందరూ ఏమనుకుంటారు చెప్పు? అది ఇంట్లో ఉంటే నాకెంతో ఆనందం. నేను మనసారా నా మనవరాలితో మాట్లాడి ఎన్నో రోజులైంది. అది ఇంట్లో ఉంటే నాకిష్టమైన వంటలు చేసిపెడుతుంది. దయచేసి నువ్వు సెలవులప్పుడు, ఆదివారాలు రావద్దు. నాకిష్టం ఉండదు. ఇది అమెరికా కాదు విచ్చలవిడిగా తిరగడానికి. నీకేం మగవాడివి, ఏం చేసినా చెల్లిపోతుంది' అనీ చెబుతుండగా బాత్‌రూమ్‌ తలుపు చప్పుడవడంతో మాట్లాడటం ఆపేశాడు గంగాధరం.
'చక్రీ సారీ! ఆలస్యమైంది. పది నిముషాల్లో వచ్చేస్తా' అంటూ గదిలోకి వెళ్లింది కౌమోదకి.
అరగంట తరువాత బయటకు వచ్చింది. ఆమెని చూడగానే చక్రధర్‌ మనస్సు ఉప్పొంగింది. ఎర్ర గులాబీ, ఆకుపచ్చ వర్ణం మిళితమైన అందమైన డ్రస్సు, పెద్ద జడ, తెల్లటి ముఖం మీద ఎర్రటిబొట్టుతో అందంగా మెరిసిపోతోంది. మరీ ముఖ్యంగా ఆ పొడవాటి జడలో తెల్లటి మల్లెలు పరిమళంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
'తాతా టిఫిన్‌ తిందువుగానీ రా! చక్రీ నీకూ పెట్టాను' అంటూ ఇద్దర్నీ పిలిచింది. గంగాధరం కోపంగా, చక్రధరం నవ్వుతూ వచ్చారు. తాత కోపంగా ఉండటాన్ని గమనించింది కౌమోదకి. చక్రధరం రోజూ వస్తూండటం తాతకి నచ్చటం లేదన్న విషయాన్నీ గమనించింది.
'కౌమూ.. ఆదివారమూ ఇంట్లో ఉండకుండా ఎక్కడికమ్మా? ఒంటరిగా
ఉండలేక ఎంతో ఇబ్బందిపడుతున్నా' అన్నాడు కోపంగా గంగాధరం.
'తాతా ముందు టిఫిన్‌ తిను. ఇడ్లీలు చల్లారిపోతాయి. నీకు వేడిగా ఇష్టమనీ ఇప్పుడే చేశాను.' అంటూ అతనికి చట్నీ వడ్డించింది.
ముగ్గురూ నిశ్శబ్దంగా టిఫిన్‌ చేస్తున్నారు తప్పా, మాటలు లేవు. ఆ నిశ్శబ్దాన్ని కౌమోదకి భరించలేక 'తాతా! మేము సినిమాకో షికారుకో వెళ్లటం లేదు. ఇక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రకృతాశ్రమం ఉంది. అక్కడ సంజీవరావుగారనీ ఒక మంచి ఆయుర్వేద డాక్టరున్నారు. చక్రీికి బాగా తెలుసు. నువ్వు చాలారోజుల నుంచి కాళ్లనొప్పులతో బాధపడుతున్నావు కదా! ఆయనకి నీ విషయం చెప్పి, ఇంటికొచ్చి వైద్యం చెయ్యమనీ అడగటానికి వెళుతున్నాం, అర్థంచేసుకో. అన్నింటికీ కోపం తెచ్చుకుంటే ఎలా?' అంది టిఫిన్‌ తింటూ.
గంగాధరానికి మనవరాలి మాటలు ఉపశమనం కలిగించాయి. తన ఆరోగ్యం కోసమే ఇద్దరూ వెళుతున్నారన్న విషయం మనశ్శాంతిని కలిగించింది. అందుకే మౌనంగా టిఫిన్‌ తినీ, మనవరాలి తలపై చెయ్యివేసి, బుగ్గల్ని ముద్దాడాడు. కౌమోదకి మనసు ఆ ఆత్మీయ స్పర్శకు ఎంతో పులకించింది. ఆ అపురూప దృశ్యాన్ని సెల్‌కెమేరాలో ఆమెకి తెలియకుండా బంధించాడు చక్రధరం.
ఆ తరువాత ఇద్దరూ బయలుదేరి వెళ్లారు.

వారం తర్వాత ఒకరోజు కౌమోదకి కాలేజీ నుంచి వచ్చి, గంగాధరానికి కాఫీ ఇస్తున్నప్పుడు. 'తల్లీ మన రైతు వెంకన్న రెండేళ్ల నుంచి కౌలు ఇవ్వట్లేదు. మొన్న మీ మావని పంపి, అడిగిస్తే.. ''ఎప్పట్నుంచో ఈ పొలాన్ని సాగు చేస్తున్నాను, ఇక ఆ పొలం నాదే.. శిస్తు ఇవ్వను'' అనీ పొగరుగా అన్నాడట. నాకెందుకో ఆందోళనగా ఉందమ్మా. పదిహేనెకరాల పల్లం భూమిని వాడు సొంతం చేసుకుంటే మన గతేం కాను? నేను ఎన్నాళ్లుంటానో తెలియదు. నా బెంగంతా నీ గురించే.
బంగారం లాంటి పొలం. ఆ ఆస్తి నీకు కాకుండా పోతుందన్న భయంతో రాత్రి నిద్ర పట్టలేదు' అన్నాడు చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.
మొదట అర్థంకాకపోయినా తర్వాత గ్రహించి, 'వాడేం చెయ్యగలడు? మన పేరు మీదున్నపుడు మనమెందుకు భయపడాలి? అవసరమైతే కేసు పెడదాం. దాని గురించి ఆలోచిస్తూ బెంగపెట్టుకోకు' అంది కౌమోదకి.
'అయ్యొచ్చేదాకా అమావాస్య ఉంటుందా? నేను వెంటనే వెళ్లి ఊరివాళ్లతో మాట్లాడి వస్తా. రేపే బయలుదేరతాను' అన్నాడు గంగాధరం.
'ఈ మాత్రం దానికి నువ్వెందుకు తాతా, నేను లేనా? నేనేం చిన్నపిల్లనా? నన్నెప్పుడూ తక్కువగా అంచనా వేస్తావు. వచ్చే ఆదివారం నేను వెళ్లి మావతోను, ఊరి సర్పంచ్‌తోనూ అన్నీ మాట్లాడి వస్తాను!' అంది.
'నువ్వు చిన్నపిల్లవి, ఆ పల్లెటూరి వాళ్లతో నెగ్గుకురావడం అంత సులువు కాదు. చదువులో గొప్పదానివి కావచ్చు. కానీ ఇలాంటి భూముల విషయంలో వ్యవహారిక జ్ఞానం, లౌక్యం ఉండాలి. నేనేదో బాధపడి వెళతాను, అవసరమైతే నువ్వు తర్వాత వద్దువుగాని' అన్నాడు గంగాధరం.
'సర్లే తాతా ఆదివారం ఏదో ఒకటి చేద్దాములే, గాబరాపడకు. నువ్వనుకున్నంత సులువైన పని కాదు అది. వాడి సంగతి నేను చూస్తా' కోపంగా అంది అక్కడి నుంచి లేస్తూ.

ఆ రోజు ఆదివారం. గంగాధరం ఉదయాన్నే బయలుదేరి, తన ఊరు వెళదామనుకున్నాడు. టాక్సీని మాట్లాడమనీ మనవరాలికి చెప్పాడు. కానీ తెల్లవారక ముందే చక్రధరం వచ్చి ఆమెని ఎక్కడికో తీసికెళ్లాడు. కౌమోదకి బయలుదేరేముందు 'తాతా నేనో పనిమీద అత్యవసరంగా వెళుతున్నా. వచ్చిన తరువాత నువ్వు మన ఊరెప్పుడు వెళ్లేదీ చెబుతా' అంటూ బ్యాగ్‌ తీసుకొని, వెళ్లిపోయింది.
గంగాధరానికి అప్పటికే ఆందోళన. విషయం తెలిసి వారమైంది. ఇంకా ఆలస్యం చేస్తే పొలం చేజారిపోతుందనీ గాబరాపడుతున్నాడు. ఆలోచిస్తూ మధ్యాహ్నం భోజనమూ సరిగ్గా చేయలేదు.
సాయంత్ర నాలుగైనా మనవరాలు రాకపోవడంతో అతనిలో ఆందోళన పెరగసాగంది. ఈ మధ్య కౌమోదకి తన మాట వినడలేదనిపించింది గంగాధరానికి. 'ఆ చక్రధరం ఆమెని పూర్తిగా వశపరచుకున్నాడు. అతను చెప్పిందే ఆమెకు వేదం. చిన్నప్పట్నుంచీ పెంచి, పెద్ద చేసిన తనమీద ఇసుమంత గౌరవం లేకపోయింది దానికి' అనుకుంటూ కళ్లు మూసుకున్నాడు.
సమయం భారంగా గడుస్తోంది. గడియారంలోని ముల్లు చేస్తున్న శబ్దం తప్పా, ఇల్లంతా నిశ్శబ్దం. అలా ఆలోచిస్తూ గంగాధరం నిద్రలోకి జారుకుంటున్న సమయంలో కాలింగ్‌బెల్‌ మోగింది.
గంగాధరం ఒక్క ఉదుటన లేచి, తలుపు తీశాడు. ఎదురుగా కౌమోదకి, చక్రధరం.
కౌమోదకి ముఖంలో చిరునవ్వు. ఒక్కసారిగా గంగాధరం చేతిని పట్టుకొని ఊపేస్తూ.. 'తాతా! విజయం మనదే' అంది గట్టిగా. గంగాధరానికి ఆమె ఏం చెబుతోందో అర్థంకాక 'ఏం జరిగిందమ్మా? ఏ విషయం' అన్నాడు.
'ఈ రోజు నేను, చక్రి కలిసి మన ఊరు వెళ్లాము. చక్రి వాళ్ల నాన్నగారు చాలా పలుకుబడున్న వ్యక్తి. ఆయన జిల్లా ఎస్పీతో చెబితే.. పదిమంది పోలీసుల్ని, తహశీల్దార్నీ మన ఊరు పంపించారు. మేము మన భూమి పట్టాలను వాళ్లకు చూపించాము. వాళ్లు రికార్డులు చూసి, ఆ పొలం మనదనీ ఆ పొలం మీదకు వెళ్తే అరెస్ట్‌ చేస్తామని వెంకన్నకి చెప్పి, వాడిని పోలీస్టేషన్‌కి తీసికెళ్లారు. అక్కడ వాడు, వాడి కొడుకులు తమ తప్పు ఒప్పుకొనీ ఇంకెప్పుడూ ఆ పొలం వైపు వెళ్లబోమనీ పోలీసులకు, తహశీల్దార్‌కి కాగితం మీద రాసిచ్చారు. పోలీసులు వచ్చి ఊరి సర్పంచ్‌ సమక్షంలో నాకు ఇచ్చారు!' అంటూ వెంకన్న, తహశీల్దార్‌, పోలీసులు సంతకాలు పెట్టిన కాగితాలు చూపించింది.
ఆ కాగితాల్ని వణుకుతున్న చేతులతో చదివి 'చాలా మంచివార్త చెప్పావమ్మా! వారం నుంచి నాకేమీ తోచటం లేదు!' అన్నాడు గంగాధరం.
'తాతా! చక్రధరం వల్లే మన పొలం దక్కింది తెలుసా? వాళ్ల నాన్నగారు గంట గంటకీ ఫోన్‌ చేసి, అధికారులను మన ఊరు వచ్చేటట్లు చెయ్యడంతో పని సులువైంది.' అంది కౌమోదకి.
గంగాధరం ఒక్కసారిగా చక్రధరంవైపు తిరిగి, 'బాబూ చక్రధరం.. నువ్వు చేసిన ఈ సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థంకావటం లేదు' అన్నాడు చేతులు పట్టుకుంటూ.

పది రోజుల తర్వాత గంగాధరానికి కేంద్ర సమాచార శాఖ నుంచి ఉత్తరం వచ్చింది.
గంగాధరం గారికి,
భారత ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల్నందర్నీ సన్మానించదలచింది. ఆ సమరంలో మీరూ గాంధీగారితో పాల్గొన్నారు. కాబట్టి మీరు వచ్చే ఆగస్ట్‌ 15వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగే సన్మానోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నాం.' అనీ కింద కేంద్ర సమాచార శాఖ కార్యదర్శి సంతకంతో ఉంది ఆ ఉత్తరం.
అది చదివీ గంగాధరం వద్దకు పరుగెత్తుకు వచ్చింది కౌమోదకి.
'తాతా! కంగ్రాచులేషన్స్‌. ఇన్నాళ్లూ నేనెందుకు బతకాలి? ఎవరి కోసం? నన్నెవరు పట్టించుకుంటున్నారు? అంటూ కోపంగా అనేవాడివి గుర్తుందా? ఈ ఉత్తరం చదివి, అది తప్పని ఒప్పుకో' అంది ఆ ఉత్తరాన్ని చూపిస్తూ.
'ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? ఏముంది అందులో' అన్నాడు కళ్లజోడు సవరించుకుంటూ గంగాధరం. కొద్దిసేపు ఆట పట్టించాక, ఆ ఉత్తరాన్ని తాతకి చదివి, వినిపించింది కౌమోదకి.
అది విన్న గంగాధరం ఆనందానికి హద్దులు లేవు. ఆ వార్త అప్పుడే టీవీ ద్వారా అందరికీ తెలిసిపోవడం వల్ల ఫోన్లు రావడం మొదలైంది. ఫోన్లు చేసి, అభినందించిన వారందరికీ తాత తరపున కృతజ్ఞతలు తెలియచేసింది కౌమోదకి.
'తాతా! ఈ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ వారితో పోరాడిన సమరయోధుడికి మనవరాలిగా.. నాకూ గర్వంగా ఉంది. నాన్నే ఉంటే ఎంతో సంతోషించేవారు. నీ సన్మాన కార్యక్రమాన్ని కనులారా చూడటానికి నన్ను తీసికెళ్తావా?' అని అడిగింది.
అప్పుడు ఆమె కళ్లల్లో చిప్పిల్లిన నీటిని చూసి గంగాధరానికి నోటమాట రాలేదు.
'నువ్వు రాకుండా ఈ వృద్ధ సమరయోధుడు ఎలా వెళ్లగలడు? ఇప్పుడు నాకు తల్లీ, తండ్రీ కొడుకూ అన్నీ నువ్వే. చెప్పాలంటే నా ఊతకర్రవి. నువ్వే లేకపోతే ఈ తాత ఎప్పుడో టపా కట్టేసేవాడు. ఈ లోకంలో నువ్వు తప్పా నాకెవరున్నారు చెప్పు? చెప్పాలంటే నీ కోసమే నేను బతికున్నా' అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.
కౌమోదకి తాత చేతులు పట్టుకొనీ 'థాంక్యూ తాతా' అంది.
'మరి చక్రధరం వస్తాడా?' అనీ అడిగాడు.
ఆ మాటకు కౌమోదకి మౌనం వహించింది.
'వస్తున్నాడా అంటే మాట్లాడవేవమ్మా? ఏం జరిగింది. ఇదివరకులా అతను మనింటికి రావటం లేదు. మీ ఇద్దరికీ గొడవేమైనా జరిగిందా?' అన్నాడు ఆత్రంగా.
'లేదు తాతా! అతను వచ్చినప్పుడల్లా నీ సూటిపోటీ మాటలు అతనికి బాధ కలిగించాయి. అందుకే రావటం తగ్గించేశాడు' అంది మెల్లగా.
'మొదట్లో అతని పట్ల నాకు సరైన అభిప్రాయం లేకపోవటం వల్ల అలా ప్రవర్తించిన మాట నిజమే, కానీ అతని మంచితనం తెలిసి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఈ కాలం యువకుల్లో యోగ్యుడు, మంచివాడు చక్రధరం. ఇప్పుడు తనంటే నాకు చాలా ఇష్టం. అతను బాధపడుతుంటే నేను క్షమాపణలు చెప్పడానికీ వెనకాడను. అతన్నిప్పుడే పిలువు' అన్నాడు గంగాధరం ఆవేశంగా.
ఆ మాటలకు ఫక్కున నవ్వుతూ 'చక్రీ లోపలికి రా' అనీ పిలవగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు చక్రధరం. వస్తూనే గంగాధరం కాళ్లకు దండం పెడుతూ 'కంగ్రాచులేషన్స్‌ తాతగారూ!' అన్నాడు.
'చాలా సంతోషం నాయనా. మీ ఇద్దరూ నన్ను తీసుకెళ్లాలి. మీరొస్తేనే నేను వెళతాను. మీ సమక్షంలో సన్మానించబడటం నాకిష్టం' అన్నాడు గంగాధరం.
'తప్పకుండా తాతగారూ.. మా ఇద్దరికీ టిక్కెట్స్‌ కూడా రిజర్వ్‌ చేయించేశాను' అన్నాడు.
ఆ రాత్రి అక్కడే భోజనం చేశాడు చక్రధరం.
వారం తర్వాత ముగ్గురూ కలిసి ఢిల్లీ బయలుదేరారు. ఫస్ట్‌క్లాస్‌ కుపేలో ప్రయాణం. గంగాధరం స్వాతంత్య్రం నాటి విషయాలు అర్ధరాత్రి దాకా చెబుతూనే ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఇద్దరూ నిద్రపోయారు.
తెల్లారేసరికి గంగాధరం బెర్త్‌ మీద కనిపించలేదు. బాత్‌రూమ్‌కి వెళ్లి ఉంటాడనీ చాలాసేపటి దాకా అనుకున్నారిద్దరూ. కానీ ఎంతకీ రాకపోయేసరికి గాబరాపడి, వెతకటం మొదలుపెట్టారు.
అప్పటికి రైలు భోపాల్‌ దాటేసింది. చక్రధరం ఫోన్లలో చాలామందితో మాట్లాడి, గంగాధరం ఆచూకీ కోసం ప్రయత్నించినా అతని జాడ తెలియలేదు.
నిరాశతో ఇద్దరూ ఢిల్లీలో దిగి, పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామనీ వెళ్తున్న సమయంలో కౌమోదకి బ్యాగులో ఒక ఉత్తరం కనిపించింది.
'ప్రియమైన మనవరాలికి..
చాలా రోజుల నుంచి నేను ఆ నాలుగు గోడల మధ్య నరకాన్ని అనుభవిస్తున్నాను. హాయిగా మన పల్లెలో విశాలమైన ఇంట్లో స్వేచ్ఛగా గాలి పీలుస్తూ నాకిష్టమైన వాళ్లతో బాతాఖానీ కొడుతూ ఇష్టమైన పనులు చేస్తూ స్వేచ్ఛగా గడిపిన నాకు.. పట్నంలోని ఇంట్లో ఒంటరితనం తీవ్రంగా బాధిస్తోంది. దానికి నువ్వు కారణం కాదు. నువ్వు నన్ను ఎంతో ప్రేమగా కన్నకొడుక్కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. అందుకే ఆరోగ్యంగా ఉన్నాను. కాకపోతే నాకు అక్కడ స్వేచ్ఛ లేదు. నా వయసు వాళ్లెవ్వరూ లేరు. దేశస్వేచ్ఛ కోసం పోరాడిన నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకే దాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోతున్నాను. ఎక్కడికెళతానో నాకే తెలియదు. అగమ్యగోచరం. కొన్నాళ్లపాటు దేశం అంతా పర్యటించి, మళ్లీ చరమాంకంలో నీ దగ్గరకి వస్తాను. నీ దగ్గరకు రాకుండా నేను పోను. అందుకే నా గురించి బెంగపడవద్దు. నీకు ఇష్టమైతే చక్రధరాన్ని పెళ్లి చేసుకో. నీకు అంతకన్నా మంచివాడు దొరకడు. అతనితో నీ జీవితం హాయిగా సాగిపోతుంది. ఇది తాతగా నా ఆశీర్వచనం.
ఉంటాను.
గంగాధరం'
అనీ అందులో ఉంది.

'ఈ సంఘటన జరిగి 15 ఏళ్లు. తాత కోసం నేనూ, చక్రధరం అంటే మీ నాన్నగారూ ఏడాది పాటు వెతికాము. అయినా ఆచూకీ దొరకలేదు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము.' అంటూ కౌమోదకి తన ఇద్దరి పిల్లలకూ తన తాత గంగాధరం వర్థంతి సందర్భంగా ఈ కథంతా చెప్పింది.
వాళ్లకిద్దరు పిల్లలు. పెద్దవాడు గంగాధర్‌. కూతురు ప్రియంవద. కొడుక్కి తాత పేరే పెట్టుకుంది.
'మరి తాతగారు తరువాత వచ్చారా?' అడిగింది ఆరో తరగతి చదువుతున్న ప్రియంవద.
'నాలుగేళ్ల తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా వచ్చారు. అప్పటికి అన్నయ్య పుట్టాడు. నువ్వింకా పుట్టలేదు. తాత ఆరోగ్యం అప్పటికే పాడైంది. కానీ నాకిచ్చిన మాట వల్ల తన చివరిదశ సమీపిస్తుందనిపించి మా దగ్గరకొచ్చేశాడు. తర్వాత ఆయన కోరిక మీద తాతని ఊరు తీసికెళ్లాము. నేను, నాన్న 15 రోజులు తాతకి సేవ చేశాము. ఆ తర్వాత కన్నుమూశారు. కర్మకాండలన్నీ నాన్నే జరిపించి, తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు' అంటూ చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ కౌమోదకి చెబుతుంటే పిల్లలూ, చక్రధరం కన్నీళ్లుపెడుతూ ఆమెను చుట్టేశారు.