దేశ సరిహద్దులో కావలి కాసే జవాన్లు
ఢిల్లీ సరిహద్దుల్లో
నడిరోడ్డుపై దీక్ష బూనిన రైతన్నలు
ఇద్దరూ ఒకటే..
జైజవాన్, జైకిసాన్ దేశానికి రెండు కళ్ళని
పాలకులు గుర్తించాలి
చెమట చిందించి
రక్తం ధారపోసైన భూమిని
ఆకలి కడుపుకి అన్నం ముద్దయ్యే అమ్మనీ
కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే
ఏ పంట.. ఏ ఎరువు వెయ్యాలో
ఎక్కడ.. ఎలా, ఎంతకు అమ్ముకోవాలో
పండించే రైతు చేతిలో లేకుండా
ఆ కార్పొరేట్ కామందుకే కట్టబెడితే
చూస్తూ వుండలేక, మౌనంగా భరించలేక
రోడ్డు పైకి వచ్చాడు.
మంచు కొండల్లో జవాన్నీ
వణికించే చలిలో నడీరోడ్డుపైనున్న కిసాన్ని
గౌరవించాలి
కురిసే హిమవర్షం సాక్షిగా
స్నానానికీ, పానానికీ..
ఆకలికీ, నిద్రకీ రోడ్డే ఇప్పటి రైతు ఆవాసం.
తన భూమిని నిలుపుకోవడం కోసం
భవిష్యత్తరాలకు ఆ భూమిని అందించడం
కోసం
తనకు తానుగా.. విముక్తి పొందటం
కోసం
సాగించే రైతు పోరాటమిది.
అడుగు కలిపి నడవాలి
నేను నువ్వూ
చేయి కలిపి కదలాలి
నువ్వూ నేను
కార్పొరేట్ రాబందుల నుంచి
ప్రయివేటు మూకల్నించీ
ఈ భూమిని కాపాడుకోడం కోసం
రైతును రక్షించుకోడం కోసం
కదలాలి నువ్వు నేను కలిసి
దనం మూలం ఇదం జగత్ అన్నట్టు
జనం మనం దేశం జగత్...
- యామినీదేవి కోడూరు
9492806520