కడప అర్బన్ జనం గుండెల్లో ఎల్‌ఐసి సుస్థిర స్థానం ఏర్పరచుకుందని వైవీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ అన్నారు. గురువారం ఎల్‌ఐసి డివిజనల్ కార్యాలయ సభాభవనంలో ఎస్‌డి ఎం కె.గిరిధర్ అధ్యక్షతన బీమా వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విసి మాట్లాడుతూ ఎల్‌ఐసి ఒక కార్పొరేట్ సంస్థగా అందించిన సామాజిక సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు పొందిందన్నారు. వ్యాపార కార్యకలాపాలు, క్లెయిముల చెల్లింపు, సామూహిక బీమా పథకాల నిర్వహణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎల్‌ఐసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా అందిస్తున్న సేవల కారణంగా, ఆధునిక యువతరం మన్ననలు కూడా పొందుతోందన్నారు. 67వ బీమా వారోత్సవాల సందర్భంగా ఆయన ఎల్‌ఐసి పాలసీదారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్‌డిఎం మాట్లాడుతూ ఎల్‌ఐసి భారతదేశంతో పాటు 14 విదేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మార్కెటింగ్ మేనేజర్ శ్యామసుందర్‌రావు మాట్లాడుతూ బీమా వారోత్సవాల సమీక్ష చేశారు. వారోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు, మహిళలకు, విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలైన సిబ్బందికి, గాంధీనగర్ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగింపు సభలో ఆహుతులకు మేనేజర్ సేల్స్ శ్రీనివాస్ స్వాగతం పలుకుతూ, రఘునాథరెడ్డి వందన సమర్పణ చేశారు. ముగింపు సభకు ముందు, ఎల్‌ఐసి ఆవరణలో వైవీయూ విసి ఆచార్య చింతా సుధాకర్ మొక్క నాటారు. కార్యక్రమంలో మేనేజర్లు సత్య శ్రీనివాస్, సత్య ప్రసాద్, ఆనందరావు, రాము నాయక్, ఎల్లారెడ్డి, స్వరూప పాల్, గురు రాజ్, పిఆర్సి కుమార్, అధికారులు వినోద్ కుమార్ పాల్గొన్నారు.










