ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : సరళ గ్రాంధిక భాషాభివృద్ధికి ఉద్యమించడంతోపాటు వ్యవహారిక భాషకోసం అవిరళ కృషి చేసిన గొప్పవ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి అని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్‌హాలులో గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెలా 3వ శనివారం 'నెలనెలా వెన్నెల' కార్యక్రమం నిర్వహించి తెలుగు భాషా నేపథ్యం, భూమిక తెలుసుకొనేలా ఒక్కో వారం ఒక్కోకవిపై కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1905లో బ్రిటిష్ కాలంలో విద్యాశాఖాదికారిగా ఉన్న జె.డి.యేట్స్, జి.వి ద్వయం తెలుగు వ్యహారిక భాషాభివృద్ధికి బీజం వేశారన్నారు. రాజుల కాలంలో రాజులను ఆకట్టుకునేందుకు సంస్కృత బాషను ఉపయోగించారని, అనంతరం సరళ గ్రాంధిక భాష కోసం గిడుగు రామమూర్తి కృషి చేశారని వివరించారు. విద్యార్థులు తెలుగు భాషపై పట్టు సాధించాలని, అందుకు పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో వచ్చే పత్రికా పదకోశం/పదవినోదం వంటి వాటిని పూరించాలని సూచించారు. పుస్తక పఠనమూ భాషాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ శాతవాహనుల కాలం నుండి తెలుగు భాష ప్రాచుర్యంలో ఉందన్నారు. తెలుగు బాషకు ప్రాధాన్యం ఇవ్వాలని, తెలుగు భాషలో పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. శాలివాహన కార్పోరేషన్ చైర్మన్ పురు షోత్తం మాట్లాడుతూ ప్రతి జీవికీ మరణం ఉన్నా భాషకు మాత్రం ఉండదని అన్నారు.
అనంతరం ఈ నెల 24న విద్యార్ధులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. తొలుత శంకరభారతిపురం విద్యార్థినులు ప్రార్థనా గీతంతో నృత్యం చేయగా కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు వెలగపూడి సుధారాణి, సత్యనారాయణ, యోహన్ రాజు, శ్రీనివాస్, రావిపాటి మాబుల్, వారున్య, బాలరాజు, వెంకటరెడ్డి ఉపన్యాసాలు, పద్య, గద్యాలు ఆలరించాయి. తెలుగు భాషకు సంబంధిన ఛాయా చిత్ర ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించగా అతిథులు, ఆహుతులు సందర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలేసి నివాలులర్పించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి కె.శామ్యూల్, సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఓబుల నాయుడు, వివిధ శాఖల అధికారులు బిజె బెన్ని, వెంకటేశ్వరరావు, దుర్గాభారు, సుధారాణి, సునీల పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : స్థానిక శాఖా గ్రంథాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో తెలుగు భాషా, జాతీయ క్రీడల దినోత్సవాలు నిర్వహించారు. క్లబ్ మాజీ అద్యక్షులు అలంగార్ మోహన్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రోటిరియన్ సింగారెడ్డి భాస్కరరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడారు. 'తెలుగు భాషను రక్షించటానికి నేనేం చేస్తానంటే?' అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తొలుత గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి, గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలేశారు. క్లబ్ సభ్యులు కె.ఎస్.ఆర్. ప్రసాద్‌రాజు, ఎ.దాసు, డి.పుల్లయ్య, బాల సాహితీవేత్త డి.బుజ్జిబాబు, గ్రంథాలయా ఇన్‌ఛార్జి అధికారి నాగుల్ మీరావలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కారంపూడి : స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో కార్యక్రమానికి ఎంఇఒ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సాహితీ వేత్త మాన్‌సింగ్ నాయక్‌ను సత్కరించారు. హెచ్‌ఎం కె.పుల్లమ్మ, ఆనందలహరి నిర్వహకులు శ్రీనివాసరావు, షేక్ మహమ్మద్ రఫీ, పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ బి.బాలునాయక్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : స్థానిక ఎస్‌కెబి ఆర్ డిగ్రీ కాలేజీలో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మికుమారి, కృష్ణవేణి కళాశాల లెక్చరర్ కె.ఆదినారాయణ, డాక్టర్ బి.జగన్నాథచార్యులు, గౌరీ మాట్లాడారు.
ప్రజాశక్తి పెదకూరపాడు : మండంలోని పలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి, ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పెదకూరపాడు జెడ్‌పి పాఠశాల హెచ్‌ఎం కె.వెంకటరమణ, తాళ్లూరు, గారపాడు పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీనివాసరెడ్డి, శివనాగేశ్వరావు మాట్లాడారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు.










