ప్రజాశక్తి-పాడేరు: పాడేరు, చింతపల్లి, పోలీస్ సబ్ డివిజన్లలో గత కొన్నేళ్ల కాలంలో లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులు, మిలీసియా సభ్యులతో అల్లూరి జిల్లా పోలీస్ శాఖ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీప ప్రాంగణంలో వారధి పేరిట 'ఆత్మీయ సమ్మేళన సంబరాలు నిర్వహించారు. వినూత్న రీతిలో పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో అల్లూరి ఏజెన్సీ 11 మండలాల్లో పెదబయలు కోరుకొండ గాలికొండ ఈస్ట్ డివిజన్ మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన సుమారు 180 మంది మావోయిస్టు దళ, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో పెదబయలు కోరుకొండ కమిటీలకు కార్యదర్శిగా పని చేసిన చిక్కుడు చిన్నారావు అలియాస్ సుధీర్, శ్రీకాంత్, మరో ఎనిమిది మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరితో పాటు పట్టణంలోని అన్ని పత్రికల మీడియా ప్రతినిధులను ఆహ్వానించి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్లూరి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, లొంగిపోయిన దళ సభ్యులు, సానుభూతిపరులతో పోలీస్ శాఖ నిరంతరం సన్నిహితమైన సుహృద్భావ సంబంధాలను కొనసాగించేందుకు ఈ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చి స్వేచ్ఛగా జీవించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ అధికారులు, సభ్యులతో కలిసి భోజనం చేశారు.సంబరాలకు హాజరైన సభ్యులందరికీ సంక్రాంతి కానుకలుగా స్టీల్ బిందెలను ఎస్పీ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్లు ఉదరు, సిబ్బంది పాల్గొన్నారు.










