Sep 13,2023 17:58

రైటప్‌ : అన్నమయ్య సంకీర్తనలపై ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్‌రెడ్డి

రైటప్‌ : అన్నమయ్య సంకీర్తనలపై ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్‌రెడ్డి

జనబాహుళ్యంలోకి అన్నమయ్య సంగీతం
'శ్రీ వేంకటేశ పదములు' పుస్తకావిష్కరణ సభలో భూమన్‌
ప్రజాశక్తి - తిరుపతి సిటి
సమాజంలోని కుల వివక్షను 600 సంవత్సరాల క్రితమే వ్యతిరేకించి పోరాడిన గొప్ప సంఘసంస్కర్త, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని తన సంకీర్తనల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తాళ్ళపాక అన్నమాచార్యుల సంగీతామతాన్ని మరింతగా జనబాహుళ్యం లోకి తీసుకెళతామని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి చెప్పారు.మహతి ఆడిటోరియంలో బుధవారం తిరుమల- తిరుపతి దేవస్థానముల ధార్మిక ప్రాజెక్టులు, శాంతా వసంతా ట్రస్ట్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన'' శ్రీ వేంకటేశ పదములు'' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి ఉత్సవాలను గతంలో తాను చైర్మన్‌ గా ఉండగా తాళ్లపాక గ్రామంలో అత్యద్భుతంగా జరిపామని చెప్పారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనల్లో 12వేలు మాత్రమే లభించాయన్నారు. వీటిని మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీఅన్నమాచార్య ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఈ దిశగా మరింత బాధ్యతగా పని చేస్తుందని చెప్పారు. నిరంతరం సామాజిక, ఆధ్యాత్మిక సేవలో తలమునకలై ఉండే డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి అన్నమయ్య సంకీర్తనలను పరిష్కరించి పుస్తక రూపంలో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం అభినందనీయమన్నారు. ఆయన కు స్ఫూర్తినిచ్చిన జర్మన్‌ రచయిత స్టీఫన్‌ త్సయిక్‌ రచించిన ''విరాట్‌'' పుస్తకాన్ని తాను అనేకమార్లు చదివానన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకాన్ని 25 వేల కాపీలు తెలుగులో ముద్రించి ఉచితంగా అందిస్తానని ఆయన ప్రకటించారు.
టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలన్నీ అర్ధమైనట్లేనన్నారు. అవకాశం ఉన్నన్ని సంకీర్తనలకు బాణీలు కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి తంజావూరులైబ్రరీలో ఉన్న సంకీర్తనలను సేకరించి ప్రత్యేక బందం ద్వారా వాటిని పరిష్కరించి పుస్తక రూపంలో తేవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో శాంతా వసంతా ట్రస్ట్‌ హైదరాబాదు వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ విభూషణ్‌ డాక్టర్‌ వరప్రసాద్‌ రెడ్డి, టీటీడీ జేఈవో సదా భార్గవి, గ్రంథ పరిష్కారకర్తలు వేటూరి ఆనందమూర్తి, శ్రీ సాయి కష్ణ యాచేంద్ర, టీటీడీ ఆస్థాన గాయకులు గరిమెళ్ళ బాలకష్ణ ప్రసాద్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆకెళ్ళ విభీషణ శర్మ పాల్గొన్నారు.