Nov 17,2023 21:55

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఐద్వా నాయకుళ్లు

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌     నగరంలోని విద్యారణ్యనగర్‌లో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో విద్యారణ్య నగర్‌కు చెందిన మహిళలతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఎం.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ ఏ.నారాయణపురం పంచాయతీ సచివాలయం.5 పరిధిలోని విద్యారణ్య నగర్‌లో ఎల్‌.11/ బి.6 విద్యుత్‌ స్తంభం పక్కన టి.కేశవరెడ్డికి చెందిన భవనంపై ఓ ప్రయివేట్‌ కంపెనీ సెల్‌ టవర్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా వడ్డెర, దినసరి బెల్దారి, ఆటో తదితర రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారు ఉన్నారన్నారు. అలాంటి చోట ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా సెల్‌ టవర్‌ నిర్మాణం చేయడం సరి కాదన్నారు. సెల్‌ టవర్‌ నిర్మాణం జరిగితే రేడియేషన్‌ వ్యాప్తి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. టవర్‌ నిర్మాణం వల్ల భవన యజమానికి వచ్చే నగదు తప్ప కాలనీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తక్షణమే సెల్‌ టవర్‌ నిర్మాణం నిలిపివేయాలని కోరారు. జనావాసం లేని ప్రాంతంలో నిర్మించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. ఇందుకు స్పందించిన కలెక్టర్‌ గౌతమి సంబంధిత అధికారులతో మాట్లాడి సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు యశోదమ్మ, పద్మ, పర్వీన్‌, కళావతి, లక్ష్మీదేవి, యశోదమ్మ, వరలక్ష్మి, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.