ప్రజాశక్తి-తెనాలి : దాదాపు 40 ఏళ్ల క్రితం వారంతా పదోతరగతి విద్యార్థులు. అప్పటి గురువులను, మిత్రులతో గడిపిన జ్ఞాపకాలు స్మరించుకోవాలనుకున్నారు. తలచిందే తడవుగా వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారి చిరునామాలు, అప్పటి గురువుల సమాచారం కూడా సేకరించారు. ఎట్టకేలకు ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని గౌతమ్ గ్రాండ్ హోటల్‌లో సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా మండూరురెడ్డి ఉమామహేశ్వరరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం వివరాలిలా ఉన్నాయి.
గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో చేరిన చుండూరు మండలం మండూరురెడ్డి ఉమామహేశ్వరరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-83లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం నిర్వహించారు. బ్యాచ్‌లోని వెన్నం కిషోర్, సీతారామయ్య, రేణుక, విజయ, ఎం.శేషగిరి సమిష్టి కృషితో బ్యాచ్‌లోని విద్యార్థుల వివరాలు సేకరించారు. అప్పటి ఉపాధ్యాయులు టి.వి.గురునాథం (సైన్స్), వెంకట్రావ్ (తెలుగు), బ్రహ్మానందం (మాథ్స్), మాచిరాజు రామకృష్ణమూర్తి (సోషల్), విజయకుమారి, సూర్యనారాయణ (పిఈటి) వివరాలు సేకరించి, వారిని కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు భావోద్వేగానికి గురయ్యారు. 40 ఏళ్ల తరువాత ఒక వేదికపైన చేరిన పూర్వ విద్యార్థులంతా తొలుత వారి వృత్తి, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను సబావేదికపై పంచుకున్నారు. ఈ సందదర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 40 ఏళ్ల తరువాత కూడా తమను గుర్తుపెట్టుకుని, వేదికపై చేర్చి సన్మానించటం మధురమైన అనుభూతిగా చెప్పారు. విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం అలవాటు చేసుకోవాలని తను నేర్పించానని, అదే స్ఫూర్తితో ఉద్యోగ విరమణ అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షునిగా సేవలందిస్తున్నట్లు మాచిరాజు రామకృష్ణమూర్తి చెప్పారు. కుటుబంలో పిల్లలతోపాటు, పాఠశాల్లో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తమవంతు కృషిచేసినట్లు టివి గురునాథం చెప్పారు. అప్పట్లో మ్యాథ్స్ ఉపాధాయునిగా తొలి పోస్టింగ్ పొంది, తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కిందని బ్రహ్మానందం చెప్పగా, సీనియర్ ఉపాధ్యాయులతో కలిసి పనిచేసే భాగ్యం దక్కిందని విజయకుమారి చెప్పారు. 40 ఏళ్ల తరువాత విద్యార్థుల చేతిలో సత్కారం పొందటం, వారి అభివృద్ధిని స్వయంగా వీక్షించటంలో ఎంతో సంతృప్తి ఉందని తెలుగు ఉపాధ్యాయులు వెంకట్రావ్ చెప్పారు. ఫిజకల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను, తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరును పీఇటీ సూర్యనారాయణ వివరించారు. పూర్వ విద్యార్థులు వెన్నం కిషోర్, సీతారామయ్య, శ్రీకాళహస్తి ఏపిట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షిరు స్కూల్ ప్రిన్సిపల్ ఎం.శేషగిరి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గురవులకు నూతన వస్త్రాలను బహూకరించి, సత్కరించారు. అప్పటి బ్యాచ్‌లో తమతోపాటు పదోతరగతి చదివి, మృతి చెందిన నలుగురు విద్యార్థులకు తొలుత వారంతా మౌనం పాటించారు. సభా కార్యక్రమం అనంతరం పూర్వ విద్యార్థులంతా మండూరులో వారు చదువుకున్న పాఠశాలను సందర్శించారు.










