డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
సోషల్ మీడియా ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ యువతను కొంత చెడు మార్గంలోకి నడిచేలా కారణమవుతుందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్ అన్నారు. అందులో మంచిని మాత్రమే తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలను, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను గురువారం ఎపి బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ బాలికలనుద్దేశించి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన అనేక మంది విద్యార్థినులు ఉన్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. బాలికలు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారని, వారి పరిరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటి అమలు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించకూడదన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌రైట్స్ జిల్లా సభ్యులు వైవి.రాజు, విద్యాకమిటీ ఛైర్మన్ డి.ఈశ్వరరావు (లోకేష్), వైస్ ఛైర్మన్ పి.శాంతి, అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.అరుణ, వైస్ ప్రిన్సిపల్ పి.సుజాత, అంబేద్కర్, పీడీ కె.విజయలక్ష్మి, మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.










