ఏలుతున్న రామచిలుకలకిపుడు
అర్థమే పరమార్థమయ్యింది
మాయదారి మద్యమే
లోటు పూడ్చే ఇంధనంగా మారిపోయింది
ఇన్నాళ్లూ స్వీయ నిర్బంధంలో
స్వేచ్ఛా వాయువులు కరువై
పంజరంలో మునగదీసుకుని వున్న
బాధ్యతలేని పావురాలిప్పుడు
సడలింపు రాగం తీయగానే
రివ్వుమంటూ గుంపులు గుంపులుగా
మద్యం చెట్టుపై వాలిపోతున్నాయి
'క్రిమి' కాటేస్తుందన్న విషయాన్ని విస్మరించి!
నిన్నటి నిర్మానుష్య రహదారుల నిండా
కట్టడిలేక ఇష్టమైన రీతిలో
పిచ్చుకల పాదముద్రలు మొలుచుకొచ్చాయి
పిచ్చుకల విచ్చలవిడితనానికి
మరెన్ని బతుకు పిట్టలు బలవ్వాలో!?
ఎగిరిపోయిందనుకున్న గబ్బిలం
చిటారు కొమ్మకు వేలాడుతూ చూస్తోందని
ఆరిపోతున్న కరోనా కాష్టాన్ని
ఎగదోసి మునుపటిలా ఇంకా రగిలించొద్దని
ఈ పక్షులకిప్పుడు
ఎవరు అర్థమయ్యేలా జ్ఞానబోధ చేయగలరు!!
వాడపర్తి వెంకటరమణ
81795 78895