Aug 26,2023 20:42

రోజంతా వీడియో కాన్ఫరెన్స్‌లు, సమావేశాల్లోనే అధికారులు
కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ ఇదే పరిస్థితి
సామాన్యులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం
స్పందనలో ఫిర్యాదిస్తేనే స్పందిస్తున్న అధికార యంత్రాంగం
క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులు దూరం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

'డెల్టాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తమ వీధిలో డ్రెయినేజీ సమస్య ఏర్పడిందని చెప్పుకునేందుకు పంచాయతీకి వెళ్తే కార్యదర్శి మీటింగ్‌కు వెళ్లారంటూ సమాధానం వస్తోంది. అక్కడున్న వారికి సమస్య చెప్పినా కార్యదర్శిని కలవాలనే సమాధానం వస్తోంది. మరోసారి వెళ్తే జూమ్‌ మీటింగ్‌లో ఉన్నారంటారు. దీంతో విసిగిపోయిన సదరు వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.'
'మెట్ట ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భూమికి సంబంధించిన సమస్యను చెప్పుకునేందుకు వెళ్లినా మండల అధికారులు అందుబాటులో ఉండటం లేదు. జిల్లా కేంద్రానికి వచ్చినా ఏ ఒక్క అధికారీ దొరకని పరిస్థితి. అదేమని అడిగితే సదరు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారంటూ సమాధానమే. దీంతో సదరు వ్యక్తి స్పందనలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు.'
పైన పేర్కొన్న వారే కాదు.. రెండు జిల్లాల్లోని సామాన్య ప్రజానీకం తమ సమస్యలను చెప్పుకునేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన జనానికి అధికారుల దర్శనమే దొరకడం లేదు. అదేమని అడిగితే ఏ రోజు వెళ్లినా సదరు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారనో, జూమ్‌ మీటింగ్‌లోనో, పై అధికారుల సమావేశంలోనో ఉన్నారంటూ సమాధానమే. దీంతో జనాలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో చిన్నచిన్న సమస్యలపైనా స్పందనలో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిందిస్థాయిలో జరుగుతున్న స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది. భూమి మ్యూటేషన్‌ సమస్య గురించి మండల కేంద్రంలో తహశీల్దార్‌ను కలుద్దామంటే ఎన్నిరోజులు తిరిగినా దర్శనం దొరకడం లేదని జనం వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, జనం తమ సమస్యలపై మండల, జిల్లా కేంద్రాలకు రావాల్సిన అవసరం లేదన్నట్లు ప్రభుత్వం తెగ ఊదరగొట్టింది. సచివాలయానికి వెళ్లి సమస్య మొరపెట్టుకున్నా ఏఒక్క సమస్యా పరిష్కారం కావడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. పైకి పంపించడం వరకే తమ పని అని, అక్కడ నుంచి సమాధానం వచ్చిన తర్వాతే తాము ఏమైనా చేయగలమని సచివాలయ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. మండలస్థాయి అధికారులు దొరకరు, జిల్లాస్థాయి అధికారులను కలవడం కలవరు అనే భావన జనంలో పెరిగిపోతుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జనాలను కలవడం దాదాపు కనుమరుగవుతోంది. సమావేశాలతోనే అధికారులు తమ సమయాన్నంతా గడిపేస్తున్నారు. దీంతో సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయికి చేరడంలో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. భూమికి సంబంధించిన సమస్య వస్తే నెలలు తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్త్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సమయం, సందర్భం లేకుండా సాగిన సమావేశాలపై ప్రతిపక్షంలో ఉన్న వైసిపి తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అంతకంటే దారుణంగా పరిస్థితిని మార్చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాలపై అధికారులు సైతం విసిగిపోతున్న పరిస్థితి కన్పిస్తోంది. సమావేశాలతోనే సమయమంతా సరిపోతే తాము పని ఎప్పుడు చేయాలో తెలియడం లేదంటూ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు వినేందుకు అధికారులకు ఖాళీ లేకపోతే ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో ప్రభుత్వం చెబితే బాగుంటుంది. ఒక అధికారిని కలవాలంటే మీటింగ్‌ అయ్యే వరకూ కనీసంగా రెండు, మూడు గంటలు బయట వేచిచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. సమావేశాలు, వీడియోకాన్ఫరెన్స్‌లు, జూమ్‌ మీటింగ్‌లపై ప్రభుత్వం సరైన విధానం పాటించాలని జనం కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.