ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : విస్తతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లాలో కుటుంబ నియంత్రణపై విస్తత అవగాహనతో పాటు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా నియంత్రణ కొరకు అర్హులైన దంపతులు కుటుంబ నియంత్రణ పద్ధతులను తప్పక పాటించాలని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది తాత్కాలిక, శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే విధంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ కూడలి నుండి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఎన్‌జిఒ హోంలో ప్రపంచ జనాభా దినోత్సవం అనే అంశంపై వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన దంపతుల్లో ఒకరికి లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి నగదు బహుమతి అందిస్తామని చెప్పారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రోత్సహించిన వైద్య సిబ్బందికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










