ప్రజాశక్తి పార్వతీపురంటౌన్ : జనాభాతో పెరుగుదలతో పేదరికం పెరుగుతుందని, జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి బగాది జగన్నాధరావు తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక ఎన్‌జిఒ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా వ్యాసరచనలో గెలుపొందిన విద్యార్థులకు, చక్కని పనితీరు కనబరచిన డాక్టర్లకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, బహుమతులు, అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల మధ్య ఎడం పాటించడం, బాల్య వివాహాలు నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంటు బి.వాగ్దేవి మాట్లాడుతూ జనాభా నియంత్రణకు బాల్యవివాహాలు నివారణ, పిల్లల మధ్య ఎడం పాటించడం పద్దతులు పాటించాలని, మాతా శిశు మరణాలను తగ్గించడం ద్వారా ఎక్కువ మందికి జన్మనివ్వకుండా అవగాహన కల్పించవచ్చునని తెలిపారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య మిషను అమలులో మన జిల్లా ప్రధమ స్థానం లో ఉందన్నారు. జనాభా పెరుగుదలతో నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని, నేడు ప్రపంచంలోనే అత్యదిక యువత, మానవవనరులు కలిగిన దేశం మనదేనన్నారు. అయినా జనాభా నియంత్రణ ఉంటే మెరుగైన విద్య, వైద్యం అందుతాయన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసరు దవళ భాస్కరరావు, డాక్టరు విజయ మోహన్, డా. వినోద్ జనాభా పెరుగుదలతో వచ్చే విపత్తులు, నివారణ చర్యలు గూర్చి ప్రసంగించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఎ.ఎన్.ఎం.లు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని తాడికొండలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బుద్దేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమములో సిహెచ్‌ఒ పద్మ, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మి, సూపర్వైజర్స్ ఐ.శ్రీను, సింహాచలం, ఎర్రయ్యమ్మ, ఆరోగ్య సహాయకులు నిమ్మకూరి రత్న ప్రసాద్, ఎస్‌వి ప్రకాష్, బి.లక్ష్మణ, ధన లక్ష్మి, అర్చన , ఎమ్.ఎల్.హెచ్.పి.లు, ఆశా లు తదితరులు పాల్గొన్నారు.










