
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ : ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో లబ్బీపేటలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాలలో బాలికా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమీషనర్ కె.వి.సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే పడిపోతుందని అది మంచి పరిణామం కాదని అన్నారు. నేడు స్త్రీలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దాని కోసం విద్య దోహదం చేస్తుందని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ టి.విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు రాణించని రంగం అంటూ ఏదీ లేదని, చంద్రయాన్ ప్రయోగంలో కూడా మహిళా శాప్త్రవేత్తలు అనేక మంది ముఖ్య భూమిక పోషించారని అన్నారు. మనం ఆధునిక కాలంలో నివశిస్తూ ఉన్నా ఇంకా కొన్ని చోట్ల బ్రూణ హత్యలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కళాశాల విద్యార్థినులు మానవహారంగా ఏర్పడి 'ఆడపిల్ల దేశానికి గర్వకారణం' అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కల్పన, జన విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి వెలగా శ్రీనివాస్, అధ్యక్షులు వి.శివ ప్రసాద్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి సుశీల పాల్గొన్నారు.
పాఠశాలల్లో ... నగరంలోని వివిధ పాఠశాలల్లో కూడా బాలికా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పాయకాపురం లహరి స్కూల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్‌వర్యంలో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు ఎ.మోహనరెడ్డి, జన విజ్ఞాన వేదిక నగర కార్యదర్శి కె.ఎస్.భాను ప్రసాద్ పాల్గొన్నారు. బుషి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, శ్రీరామ్ స్కూల్‌లో జరిగిన వేడుకల్లో నగర ఉపాధ్యక్షులు బి.సురేష్‌కుమార్ పాల్గొన్నారు. కేదారేశ్వరపేట ఫ్యూచర్‌ఫాత్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర ఉపాధ్యక్షులు మామిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.