జన జాతర
భక్తుల రద్దీతో
హోరెత్తిన వెంకటగిరి
ప్రజాశక్తి-వెంకటగిరి
వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జాతర జన జాతరగా మారింది. గురువారం అమ్మవారి ఊరేగింపుతో రాజావీధి దద్దరిలింది. బుధవారం అర్ధరాత్రి కుమ్మరివీధిలోని అమ్మవారిళ్ళుగా భావించే ఇంటి నుండి అమ్మవారి ప్రతిమను తయారుచేసి అత్తగారిళ్ళయిన జీనిగలవారివీధిలో అమ్మవారికి కళ్ళు, దిష్ఠిచుక్కపెట్టి అక్కడ నుండి ఊరేగింపుగా అమ్మవారిగుడి నుండి గురువారం తెల్లవారుజాము నుండే భక్తుల దర్శనార్ధం పెట్టారు. సాంప్రదాయం ప్రకారం వెంకటగిరి రాజాల నుండి సారే అమ్మవారికి అందజేశారు. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకటగిరి రాజాలు అమ్మవారికి పూజాసామాగ్రిని అందజేశారు. గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేక రధంపై ఊరేగింపుగా రాజావీధి మీదుగా కాశీపేట, శివాలయంవీధి మీదుగా మల్లమ్మగుడి ప్రాంతంలో నిమజ్జనం చేశారు. వెరకటగిరిరాజా కుటుంభీకులు సాయికృష్ణ యాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్ర రాజానగిరి నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, చిన్నబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేసి పోలీసులు స్వయంగా కొంతమందిని వికలాంగులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎన్నడూ లేనివిధంగా జాతర ప్రశాంతంగా జరిగేందుకు సిసి కెమారాలు ఏర్పాటు చేయడంతో ఆకతాయిలు జాగ్రత్త పడ్డారు. చోరీలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. పోలీసులు బారీ భందోబస్తు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా రెండు రోజుల పాటు భక్తులకు అవస్థలు లేకుండా చేశారు. పోలీసులు కంట్రోల్ రూమ్ వద్దనే ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనభాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఊరేగింపు ప్రశాంతంగా జరిగింది. తొక్కిసలాట లేకుండా పట్టణంలో ఊరేగింపు సాగింది. జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణా భక్తులు తరలివచ్చారు. రాజకీయనాయకులు, ప్రముఖలు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, సూళ్ళురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంఎల్‌సీలు బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, మేరిగ మురళీ, దేవదాయశాఖ ఇఓ శ్రీనివాసులరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ నక్కా బాను ప్రియ, వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య వెంకటగిరి పట్టణ ప్రముఖులు విచ్చేసి మొక్కలను తీర్చుకున్నారు.
వెంకటగిరిలో విఐపిల తాకిడి
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకునే సామాన్య భక్తజనానికి విఐపిల తాకిడితో అవస్థలు పడ్డారు. నెల్లూరుజిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రావడంతో క్యూలైనులో అమ్మవారిని దర్శించుకొనే భక్తులు గంటలు తరబడిన క్యూలైనులో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు కనీసం 50మందికి తగ్గకుండా వారి అనుచరులతో రావడంతో ఈదుస్థితి నెలకొంది. మంత్రుల కాన్వాయితో పదుల సంఖ్యలో వాహనాలు అమ్మవారి దేవస్థాన సమీపానికి రావడంతో రహదారులన్నీ కుంచించుకుపోయాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రం, జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఈ జాతరకు తరలివచ్చారు. ఆయన దర్శనానికి వెళ్ళిన సందర్భంలో పెద్దసంఖ్యలో ఆయనతో పాటు ఆయన అనుచరులు దర్శనానికి రావడంతో భక్తుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైయింది. విఐపిల తాకిడి ఎన్నడూ లేని విధంగా ఈజాతరకు పెరిగిందని అమ్మవారి దర్శనం ఆలస్యంగా సాగిందని పలువురు భక్తులు వాపోయారు.
దాతల దాతృత్వం
జాతరలో పలువురు దాతలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. స్థానిక మదీనా మోటార్Êస్పేర్స్ యజమానికి కరిమూల్లా భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేశారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హౌటల్ అధినేత కొడవలూరు ధనుంజరురెడ్డి అన్నదానం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కలిమిల రాంప్రసాద్‌రెడ్డి అన్నదానం నిర్వహించారు.
వెంకటగిరిలో విఐపిల తాకిడి










