Nov 07,2023 21:28

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షెడ్యూల్‌ తెగల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి నిర్వహించనున్న జన్‌ జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో గృహ నిర్మాణాలు, సంపూర్ణ పోషణ, ఓటరు పునశ్చరణ, ప్రాధాన్యతా భవనాలు, గడప గడపకు మన ప్రభుత్వ పనులు, జల జీవన్‌ మిషన్‌, రీ సర్వే తదితర అంశాల ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్‌ జాతీయ గౌరవ్‌ దివాస్‌, హమారా సంకల్ప్‌ విక్షిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాలు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, పోషన్‌ శక్తి నిర్మాన్‌ అభియాన్‌, జన్‌ ధన్‌ యోజన, చేతి వృత్తిదారులకు తదితర పథకాలపై రోజుకు రెండు పంచాయతీల్లో ప్రచార వాహనంతో చిత్ర ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. రక్తహీనత లోపం అధిగమించేందుకు నిబద్దతతో పనిచేయాలని సూచించారు. మాతా, శిశు మరణాలు అరికట్టేందుకు చిత్తుద్ధితో పనిచేసి ప్రాణాలు కాపాడమన్న సంతృప్తి పొందాలన్నారు. జిల్లా అధికారులు దత్తత తీసుకున్న పాఠశాలల్లో మౌలిక వసతులు వినియోగించుకొని విద్యార్థులు ఏఏ సబ్జెక్ట్‌ల్లో వెనకబడి ఉన్నది గుర్తించి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో ఉపాధ్యాయులను నియమించి తరగతులు నిర్వహిస్తే శత శాతం ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో తక్కువ సమయంలో ఓటరు పునశ్చరణ కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాలకు నిధులు, సామాగ్రి సమస్య లేదని లక్ష్యం మేరకు పూర్తికి వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలకు ట్యాప్‌ లను అమర్చాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ బగాది జగన్నాథరావు, డ్వామా, డిఆర్‌డిఎ, హౌసింగ్‌ పీడీలు కె.రామచంద్రరావు, పి.కిరణ్‌కుమార్‌, పి.రమేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ జిల్లా అధికారి ఓ.ప్రభాకర రావు, జిల్లా గహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.రమేష్‌, డిపిఒ బలివాడ సత్యనారాయణ, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌, సర్వే అండ్‌ సెటిల్మెంట్‌ అధికారి కె.రాజ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.