May 21,2023 00:33

మాట్లాడుతున్న నాగరాజు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: జంతు సంరక్షణ చట్టాలు పక్కాగా అమలు చేయాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం డివిజనల్‌ పరిపాలనాధికారి బి.నాగరాజు సూచించారు. ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో డివిజన్‌ స్థాయి జంతు సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్‌, మండల, గ్రామ స్థాయిలో జంతు సంరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. జంతువుల అక్రమ రవాణా నియంత్రించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 1960 జంతు సంరక్షణ చట్టం ప్రకారం జంతువుల అక్రమ రవాణా నిరోధించాలని చెప్పారు. 1920 చట్టం ప్రకారం కుక్కలను చంపకూడదన్నారు. పశువుల విక్రయాలకు అనుమతులు లేని సంతలను మూసి వేయాలని, చట్టాన్ని అతిక్రమించి మూగ జీవాల విక్రయాలు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎపి గోసంరక్షణ సమాఖ్య గౌరవ అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కెవిఆర్‌ సత్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడర్‌ బండారు వెంకట రమణ, వైద్యాధికారులు, పోలీసు అధికారులు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, తహశీల్దారులు, ఎంపిడిఒలు, తదితరులు పాల్గొన్నారు.