
న్యూఢిల్లీ, (ఐఎన్‌ఎన్) : పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లు, 2021ని ఆమోదిస్తామని కేంద్రం ఏకపక్షంగా ప్రకటించడానికి నిరసనగా జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు నాలుగు రోజుల సత్యాగ్రహానికి దిగారు. బుధవారం రెండో రోజు దీక్షలో వందలాదిమంది ఉద్యోగులు పాల్గొనడానికి సిద్ధమయ్యారు. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ (ఎన్‌సిసిఓఇఇఇ) పిలుపు మేరకు ఈ సత్యాగ్రహం జరుగుతోంది. దీక్షలో పాల్గొనడానికి ఉద్యోగులు వచ్చేసరికి వందలాదిమంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దీక్షా వేదికను చుట్టుముట్టారు. ఉద్యోగులను లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అక్కడ రోడ్డుపై నిలుచోవడానికి కూడా అనుమతించలేదు. దాంతో ఎన్‌సిసిఒఇఇఇ నేతలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులను సంప్రదించగా, పార్లమెంట్ సమీపంలో ప్రదర్శనలు జరపకుండా నిషేధం వుందని చెప్పారు. వందలాదిమంది విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 5, 6 తేదీల్లో కూడా ఆందోళన కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. నిరసన తెలిపేందుకు ఉద్యోగులకు గల ప్రజాస్వామ్య హక్కును కాలరాసేందుకు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ ఈ నెల 9న అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు, ప్రజలు ప్రదర్శనలు నిర్వహించాలని కమిటీ పిలుపు నిచ్చింది. బిల్లును ఆమోదించడాన్ని నిలిపివేయాల్సి ందిగా ప్రభుత్వాన్ని కోరింది. విద్యుత్ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో ఈ నెల 10న సమ్మెను విజయవంతం చేయాలని కమిటీ మరోసారి పిలుపునిచ్చింది.