Nov 01,2023 23:13

ప్రజాశక్తి - భట్టిప్రోలు (వేమూరు)
జంపని సహకార చక్కెర కర్మాగారంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో బుధవారం స్థానిక శాసనసభ్యులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీ మూత పడిపోవడంతో ఉద్యోగులకు వేతనాలు కూడా రాక వస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవ చుండూరు మండలం యడ్లపల్లిలో జరిగిన కార్యక్రమానికి వచ్చిన సిఎం జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులు తమ సమస్యను వివరించారు. మంత్రి నాగార్జున సహకారంతో రూ 3.68కోట్ల నిధులు మంజూరు కాగా వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబడ్డాయని తెలిపారు. ఉద్యోగులకు రూ.14.74కోట్లు రావాల్సి ఉండగా తొలి విడతగా ఈ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 352మందికి ఈ సొమ్మును జమ చేసినట్లు తెలిపారు. వీరిలో 93మంది పర్మినెంట్ ఉద్యోగులు, 64మంది సీజనల్ పర్మినెంట్ ఉద్యోగులు కాగ 112మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు, 9మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఇదిలా ఉండగా జంపని సహకార చక్కెర సంఘం దాదాపు రూ.150కోట్ల నష్టాల్లో ఉన్నట్లు యాజమాన్యం తెలిపారు. మిగిలిన రూ.11.6కోట్లు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మూతపడటంతో కార్మికులు 2014లోనే ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డినీ కలిసి విన్నవించారని అన్నారు. దీని దృష్ట్యా ఎడ్లపల్లి సభలో కార్మికులకు వేతనాలు అందిస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ యెల్లమాటి మోహన్, సర్పంచ్ మార్తమ్మ, వైసీపీ మండల కన్వీనర్ బొల్లిముంత ఏడుకొండలు, పిఎసిఎస్ చైర్మన్ గాజుల భానుప్రకాష్, కోగంటి లవ కుమార్ పాల్గొన్నారు.