స్వయం ఉపాధి పేరుతో ఇష్టారాజ్యంగా కొందరు ఆక్రమణలకు పాల్పడడంతో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. అదే సమయంలో ఆక్రమణల కింద భారీ పైపులైన్లు ఉండడంతో, అత్యవసర సమాయాల్లో లీకులు ఏర్పడితే వాటికి మరమ్మతులు ఎలా చేయాలోనని అధికారులు తలలు పట్టుకున్నారు. ఆక్రమణలన్నీ రాజకీయ అండదండలతోనే సాగడంతో అధికారులది నోరెత్తలేని పరిస్థితి. ఇదీ మండలంలో ఎర్రన్న గుడి జంక్షన్ దుస్థితి.
ప్రజాశక్తి -గరుగుబిల్లి : తోటపల్లి పాత బ్యారేజీపై నుంచి వాహనాల రాకపోకలు నిలిపేసిన నుంచి మండలంలోని ఎర్రన్న గుడి జంక్షన్ కీలకంగా మారింది. గరుగుబిల్లి మండల కేంద్రంతో పాటు ఉల్లిభద్రకు ఈ జంక్షన్ మీదుగే వెళ్లాల్సి ఉంటుంది. అటు పాలకొండ, శ్రీకాకుళం, ఇటు కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాలకు కూడా ఈ జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలి. దీంతో నిత్యం ఈ జంక్షన్ వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. అదే సమయంలో పాలకొండ, శ్రీకాకుళం, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురానికి వెళ్లే ఆర్‌టిసి బస్సులు ఎక్కాలనుకునే గరుగుబిల్లి మండల వాసులకూ ఈ జంక్షనే కీలకం. దీంతో కొందరు వ్యాపారులు మొదట్లో తోపుడు బండ్లతో తినుబండారాలు, పండ్లు వంటివి విక్రయించేవారు. ఎర్రన్న గుడి జంక్షన్ రోడ్డుకిరువైపులా ప్రభుత్వ స్థలాలు కావడంతో కొందరు షాపుల కోసం శాశ్వత ప్రాతిపదిక నిర్మాణాలు చేపట్టారు. ఇలా షాపులు పెట్టిన వారు విద్యుత్ కనెక్షన్లు, తాగునీటి బోర్లు సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అక్రమ నిర్మాణాలతో విశాలమైన ఎర్రన్న గుడి జంక్షన్ నేడు పూర్తి కుచించుకుపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి, ఎప్పుడు ఏ ప్రమాదంతో జరుగుతుందోనని స్థానికులు, వాహనదారులు హడలిపోతున్నారు.
నిర్మాణాలతో ట్రాఫిక్‌కు ఇక్కట్లు
రోడ్డుకిరువైపులా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఎర్రన్నగుడి జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ తలెత్తుతోంది. ప్రధాన రహదారి ఎర్రన్న గుడి జంక్షన్ మీదుగా వెళ్తుండటంతో ఆర్‌టిసి బస్సులు సహా ఇతర వాహనాలతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు సైతం సాధారణంగా మారిపోయాయి. ప్రమాదాల కారణంగా ఎందరో వాహనదారులు, పాదచారులు సైతం కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆక్రమణల కారణంగానే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతున్నారు. ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతోపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల సపోర్టు..?
ఆక్రమణలకు అధికారుల సపోర్టు ఉందా..? అంటే అవుననే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థలం అందులోనూ భారీ పైపులైన్లపై నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నోరెత్తడం లేదు. సరికదా.. ఆయా షాపులకు విద్యుత్తు, బోరు కనెక్షన్లకు కూడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చిన సమయంలో తూతూమంత్రంగా హెచ్చరించడం, తరవాత ఆ ఊసే ఎత్తకపోవడం అధికారులకు పరిపాటిగా మారింది. 2018లో అప్పటి తహశీల్దార్ ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. తరవాత ఏమైందో ఏమోగాని ఆయన గాని, ఆ తరవాత వచ్చిన తహశీల్దార్లు గాని ఆక్రమణలపై నోరెత్తడం మానేశారు. ఆక్రమణదారుల నుంచి నెలవారీ మామ్మూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఆక్రమణలపై చూసీచూడనట్లు వెళ్లిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
భారీ పైపులైన్లపై నిర్మాణాలు
ఎర్రన్నగుడి జంక్షన్ మీదుగా తోటపల్లి బ్యారేజీ నుంచి పార్వతీపురం మున్సిపాల్టీకి తాగునీరందించడానికి భారీ పైపు లైన్లు వేశారు. ఆ పైపులైన్ల మీదే కొందరు ఆక్రమణదారులు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి మరమ్మతులు చేయాలన్నా ఇబ్బందులు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాగునీటి సరఫరా ఇబ్బందులు ఏర్పడినా, ఎక్కడైనా భారీ పైపు లైన్ లీకైనా మరమ్మతులు చేయాలంటే ఆ నిర్మాణాలు పడగొట్టాల్సి ఉంటుంది. అందుకు వ్యాపారులు ఒప్పుకుంటురా? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. రోడ్డుకు మరో వైపు ఉన్న ఆర్‌అండ్‌బి స్థలాల్లోనూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు.
ఆక్రమణలు తొలగించడం ఖాయం
పైపులైన్లకు సమస్య వస్తే వాటిపై నిర్మించిన ఆక్రమణలను తొలగిస్తాం. ఎవరైనా సొంత స్థలాలుంటే, పైపులైన్లకు దూరంగా నిర్మాణాలు చేపట్టుకోవాలి. అలా కాకుండా పైపులైన్లపై నిర్మాణం చేస్తే మరమ్మతుల సమయంలో తొలగించడం ఖాయం.
- జి. ఆనందరావు, ఎఇ, పార్వతీపురం మున్సిపాలిటీ
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు
రోడ్డు వెడల్పు చేసే సమయంలో ఆర్‌అండ్‌బి స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తాం. ప్రభుత్వ స్థలాల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టకూడదు. భవిష్యత్తులో ఎర్రన్న గుడి జంక్షన్ మీదుగా నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టే అవకాశముంది. రోడ్డు విస్తీర్ణం జరిగే క్రమంలో ఎవరు చెప్పినా కూల్చడం ఖాయం.
- నిర్మల, ఆర్‌అండ్‌బి అధికారి










