Nov 04,2023 21:13

సాగునీరు విడుదల చేయకపోవడంతో పూడికపోయిన కాలువ

బాధ్యతతో మెలగాల్సిన నీటిపారుదల శాఖాధికారులు ముఖం చాటేస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు సైతం మాటలతో సరిపెట్టేస్తున్నారు. ఇటు చినుకు పడక, అటు నీరు లేక బీటలు వారిన పంట భూములు, ఎండుతున్న పంటలను చూసి రైతుల గుండెలు బరువెక్కుతున్నాయి. వర్షాభావం వల్ల మండలంలోని వేలాది ఎకరాలు బీడులుగా మారాయి. ఒకటా... రెండా... మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. జంఝూవతి కాలువ పరిధిలో ఉన్నా పాలకుల నిర్లక్ష్యం వల్ల సాగునీటి దుస్థితి ఇది.

ప్రజాశక్తి - గరుగుబిల్లి : 
మండలంలోని 2,400 ఎకరాలకు జంఝావతి సాగునీరే ప్రధానం. ఆ కాలువ నుంచి నీరొస్తేనే ఈ మొత్తం విస్తీర్ణంలో పంటలు సాగు చేయడానికి అవకాశముంటుంది. ఈ విషయం అధికారులకు సైతం ఎరుకే. నిర్దేశించిన మొత్తం 30 వేల ఎకరాలకు గానూ కేవలం పది వేల ఎకరాలకే సాగు నీరందిస్తూ చేతులు దులుపుకుంటున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు. దీంతో మిగిలిన 20 వేల ఎకరాల్లో సాగు వర్షధారంపైనే సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిస్తే సరి. లేకుంటే పొరపాటున చినుకు ముఖం చాటేస్తే, రైతన్నలు పెట్టిన పెట్టుబడంతా బుడిదలో పోసిన పన్నీరే అవుతోంది. దీంతో జంఝావతి కాలువ కింద వ్యవసాయం చేయాలంటే రైతులు హడలెత్తిపోతున్నారు. భూమిని నమ్మకున్న రైతన్నకు మరో ప్రత్యామ్నాయం లేక... ఏటా పెట్టుబడులు పెట్టడం... అప్పుల పాలవ్వడం పరిపాటిగా మారిపోయింది.
కాలువలో పూడికలు తొలగింపుపై నిర్లక్ష్యం...
ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ముఖం చాటేశాయి. కురిసిన ఒకట్రెండు వర్షాలకు అప్పులు చేసి, వరి నారుమళ్లుకు రైతులు సిద్ధమయ్యారు. ఉడుపులు సైతం పూర్తి చేసుకున్నారు. రెండు నెలల నుంచి వర్షాలు కురవకపోడంతో భూములు బీటలు వారుతున్నాయి. నీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జంఝావతి అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఒత్తిడి వచ్చిన సమయంలో నీరు విడుదల చేస్తున్నా, ఆ నీరు కాలువలోనే ఇంకిపోతోంది. గుర్రపు డెక్క, ఇతర పిచ్చి మొక్కలతో కాలువలో పూడికలు పేరుకుపోయాయి. దీంతో నీరు ప్రవహించే మార్గం లేకపోవడంతో నీరింకిపోతోంది. దీనిపై రైతులు మాట్లాడుతూ, రెండేళ్ల నుంచి కాలువలో పూడికలు తొలగించలేదని ఆరోపిస్తున్నారు. కాలువ చుట్టు పక్కల ఉన్న రైతులంతా చందాలు వేసుకుని పూడికలు తొలగించినా అధికారులు మాత్రం నీరు వదలడంలేదని వారు వాపోతున్నారు.
ఎండుతున్న భూములు
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జంఝావతి కాలువ నుంచి అధికారులు నీరు విడిచిపెట్టలేదు. ఒకవైపు వర్షాల్లేకపోవడంతో, సాగు భూములన్నీ బీటలు వారుతున్నాయి. పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇటువంటి సమయంలోనూ అధికారులు నీరు విడిచిపెట్టకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో జంఝావతి కాలువ కింద ఉల్లిభద్ర, గొట్టువలస, శివ్వాం, కొత్తూరు, రావుపల్లికి చెందిన 2,400 ఎకరాలు సాగవుతున్నాయి. అటు వర్షాల్లేక, ఇటు కాలువ నుంచి నీరు విడుదల కాకపోవడంతో ఆ 2,400 ఎకరాల్లో సాగవుతున్న పంటంతా ఎండిపోతోంది. ఇప్పటికే వేల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, నీరులేక పంట చేతికి వచ్చే అవకాశమే లేదని రైతులు వాపోతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జంఝావతి కాలువ నుంచి నీరు విడుదల చేస్తే, కొద్దిపాటి పంటనైనా కాపాడుకోవొచ్చునని అన్నదాతలు వాపోతున్నారు.
మోటార్లతో నీరు
ఎండిపోతున్న పంటను రక్షించుకోడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన కొందరు రైతులు మోటార్ల సాయంతో జంఝావతి కాలువలో ఉన్న నీటిని తోడుతున్నారు. మరికొంతమంది రైతులు అప్పులు చేసి ఎండిపోతున్న పైరుకు మోటారు సాయంతో నీరందిస్తున్నారు. ప్రస్తుతానికి పంటను నిలబెట్టుకుంటే, రాబోయే రోజుల్లో వర్షాలు పడకపోవా..? అని అన్నదాతు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
అప్పులే మిగిలాయి...
నాకున్న ఎకరా భూమి వరి వేశాను. అప్పు చేసి రూ.18 వేల వరకు మదుపెట్టాను. ఇప్పుడా ఆ డబ్బంతా పోయినట్లే. వర్షాల్లేవని ఎన్ని పర్యాయాలు అధికారులకు మొరపెటు ్టకున్నా, జంఝావతి కాలువ నుంచి నీరు విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు పంటంతా ఎండిపోయింది. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
లచ్చిరెడ్డి అచ్యుతరావు, రైతు,
ఉల్లిభద్ర.