ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : జంఝావతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్ చేశారు. మండలంలోని తాళ్లబురిడి, డి.ములగ మధ్య అసంపూర్తిగా ఉన్న జంఝావతి ఎగువ కాలువతో పాటు పరిసర ప్రాంతాల్లో వరి నాట్లు వేసిన పొలాలను సిపిఎం కార్యకర్తలు, నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్లు ఖర్చుపెట్టి జంఝావతి కాలువ తవ్వి వాటిని అసంపూర్తిగా వదిలేయడంతో తాళ్లబురిడి పరిసర గ్రామాలకు సాగునీరు లేకుండా పాలకులు చేశారని విమర్శించారు. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నదని చెబుతున్న పాలకులు జంఝావతి ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశాతో మాట్లాడి, 112 మంది నిర్వాసితుల సమస్యను పరిష్కారించగలిగితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. రైతులకు నీరందిస్తామని హామీ ఇవ్వడం తప్ప ఈ ప్రాజెక్టు పూర్తికి ఏ చర్యలూ చేపట్టలేదని, దీనివల్ల ఈ గ్రామాల రైతులు వర్షంపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేస్తున్న రైతులతో మాట్లాడితే ఇప్పుడు పడిన అరకొర వర్షాలకు నాటు వేస్తున్నామని, పంట వస్తుందన్న నమ్మకం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే నీరందుతుందని తెలిపారు. డి.ములగ వద్ద వర్షపు నీరు పోవడానికి స్లూయిస్ నిర్మాణానికి 100 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. దీని నిర్మాణం మరిచారని, చుట్టుప్రక్కల వర్షాకాలంలో పొలంలోకి వెళ్తే అందులో పడిపోయే పరిస్థితి రైతు పొట్నూరు అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి స్లూయిసి, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించేందుకు నిధులు కేటాయించాలని, ఒడిశాతో మాట్లాడి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని వేణు డిమాండ్ చేశారు. పరిశీలనలో సిపిఎం మండల నాయకులు పి.రాము, స్థానిక రైతులు బలగ తిరుపతి, బేత నాగభూషణం, చిట్టి శ్రీరాములు, లోకేష్ రాము తదితరులు పాల్గొన్నారు.










