
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. కోడి కత్తితో అతిదారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన గోసుల ఏడుకొండలు(బాలాజీ) (27) పెయింటింగ్ పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాబాయి వరుస అయిన శ్రీనుకు మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో 15 రోజులుగా ఒకరిపై ఒకరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సోమవారం సాయంత్రం ఇరువురి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కొందరు స్నేహితుల మధ్య కలుసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. దీంతో శ్రీను అప్పటికే తనవెంట తెచ్చుకున్న కోడికత్తితో ఏడుకొండలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని స్థానికులు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే ఏడుకొండలు పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలాజీకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శ్రీను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.