
ఆటగాళ్లనే కాదు... అభిమానులనూ ఉరుకులు, పరుగులు పెట్టించి, ఉర్రూతలూగించేే క్రికెట్ పండుగ కొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటివరకూ జరిగిన ఐపిఎల్ మాదిరిగానే ఈసారి కూడా అభిమానులకు క్రికెట్ మజా అందించనుంది. కొరతమంది విదేశీ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. పరుగుల వరద పారిరచే అత్యద్భుత ఆటగాళ్లకు కొదవలేదు. కోట్లాది రూపాయలను కుమ్మరించి, కొనుగోలు చేసిన ఫ్రారచైజీలు ఆ ఆటగాళ్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. మిగిలిన ఆటగాళ్లలో చిచ్చర పిడుగులకు కొదవే లేదు. గత ఐపిఎల్‌లో వెలుగుచూసిన వెంకటేష్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువకుల్లాగే ఈసారి కూడా తెరపైకి వచ్చేవారు చాలామందే ఉంటారన్న అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్లలో వికెట్ కీపర్, బ్యాటర్ ఇషన్ కిషన్, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ టాప్-3లో నిలిచారు. అన్ని ఫ్రాంచైజీలు మన క్రికెటర్లపైనే కనకవర్షం కురిపించాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఒక్క సీజన్ ఆడితే చాలు కోటీశ్వరుడైపోయినట్లే.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోన్న, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి కోట్లాది రూపాయలు ముట్టజెప్తున్న మన లీగ్ గురించే ఈ కథనం..
ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోన్న, ఐసిసికి కోట్లాది రూపాయలు ముట్టజెబుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మరో రెండు జట్లు చేరికతో బలీయంగా తయారైంది. గత సీజన్ వరకు ఎనిమిది జట్లు మాత్రమే ఆడితే.. ఈసారి ఆ సంఖ్య 10కి చేరింది. దీంతో పాత సీజన్‌లకు భిన్నంగా, రెండు గ్రూపులుగా 2022 ఐపిఎల్ మెగా సంగ్రామం జరగనుంది. మార్చి 26 నుంచి నాలుగు ప్రధాన వేదికల్లోనే టోర్నమెంట్ జరగనుంది. లీగ్ దశలోనే ఏకంగా 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. 2008 నుంచి ఐపిఎల్ జరుగుతుండగా. 2011లో 10, 2012, 13లో తొమ్మిది జట్లు చొప్పున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రాతినిధ్యం వహించాయి. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించిన బిసిసిఐ... దశాబ్దకాలం నాటి ఫార్మాట్‌ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ లీగ్‌లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దక్కన్ ఛార్జర్స్, కొచ్చి టస్కర్ కేరళ, పూణే వారియర్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ నష్టాల పాలై తమ ఫ్రాంచైజీలను మూసేసుకున్న సందర్భాలూ లేకపోలేదు.
నాలుగు మైదానాల్లో 70 మ్యాచ్‌లు..

ముంబయిలోని వాంఖడే, డివై పాటిట్, బ్రబోర్న్ స్టేడియాల్లోని మూడు వేదికల్లో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగిలిన 15 మ్యాచ్‌లకు పూణెలోని ఎంసిఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 70 మ్యాచ్‌ల్లో వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబోర్న్‌లో 15 మ్యాచ్‌లు, డివై పాటిల్‌లో 20 మ్యాచ్‌లు, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
50 శాతం ప్రేక్షకులకు అనుమతి..
మార్చి 26 నుంచి మే 29 వరకూ జరిగే సీజన్-15 ఐపిఎల్‌ను సగం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రేక్షకుల అనుమతిపై అధికారికంగా ప్రకటనను ఇప్పటికే వెల్లడించారు. వాస్తవానికి మార్చి 27 నుంచి 2022 ఐపీఎల్‌ని ప్రారంభించాలని బిసిసిఐ నిర్ణయించినా.. టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మార్చి 26 (శనివారం) నుంచే ఈ మెగాటోర్నీని ఆరంభించాలని పట్టుబట్టడంతో.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెనక్కి తగ్గక తప్పలేదు. కరోనా నేపథ్యంలో గత సీజన్ ఐపిఎల్ ఫస్ట్ హాఫ్‌ని భారత్‌లో.. సెకండ్ హాఫ్‌ని యూఏఈలో నిర్వహించగా.. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరగనున్నాయి.

ప్రతి జట్టూ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు చొప్పున..
2022 ఐపిఎల్ సీజన్ ఈసారి సరికొత్త ఫార్మాట్‌లో జరగనుంది. గ్రూప్-ఎలో ముంబయి ఇండియన్స్ (5 టైటిళ్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (2), రాజస్థాన్ రాయల్స్ (1), ఢిల్లీ క్యాపిటల్స్ (0), లక్నో సూపర్ జెయింట్స్ (0) ఉండగా.. గ్రూప్-బిలో చెన్నై సూపర్ కింగ్స్ (4 టైటిళ్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (1), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (0), పంజాబ్ కింగ్స్ (0), గుజరాత్ టైటాన్స్ (0) జట్లు ఉన్నాయి. దాంతో అత్యధిక టైటిళ్లు నెగ్గి, వేర్వేరు గ్రూపుల్లో ఉన్న ముంబయి, చెన్నై జట్టు ముఖాముఖి రెండుసార్లు తలపడనున్నాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టూ.. అదే గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లను ఆడనుంది. దాంతో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఇక మిగిలిన ఆరు మ్యాచ్‌లకుగానూ వేరే గ్రూప్‌లోని ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అప్పుడు ఆ సంఖ్య 13కి చేరుకుంది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌ని ఆ జట్టుకి సమానస్థాయిలో వేరే గ్రూప్‌లో ఉన్న జట్టుతో ఆడాల్సి ఉంటుంది. దీంతో 14 మ్యాచ్‌లు చొప్పున లీగ్ దశలో పూర్తవుతాయి.
స్టార్ ప్లేయర్స్ లేని సన్‌రైజర్స్..
ఐపీఎల్ 2022 సీజన్ వేలానికి రూ.68 కోట్లతో వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. సీనియర్ క్రికెటర్లని వదిలేసి అన్‌క్యాప్డ్ ప్లేయర్లనే ఎక్కువగా కొనుగోలు చేసింది. దాంతో.. అసహనంతో అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశారు. అలానే ట్రావెర్ బైలిస్, బ్రాడ్ హడిన్ కూడా బ్యాక్ రూమ్ స్టాఫ్ నుంచి తప్పుకున్నారు. నికోలస్ పూరన్ కోసం ఏకంగా రూ.10.75 కోట్లు ఖర్చు పెట్టిన సన్‌రైజర్స్... గత సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌ను వదులుకోవడం ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. సన్‌రైజర్స్ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఉండగా.. వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ.8.5 కోట్లు), రోమారియో షెఫర్డ్ (రూ.7.75 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు) లని వేలంలో సన్‌రైజర్స్ దక్కించుకుంది. కానీ.. ఈ ఐదుగురిలో ఒకరి ధర కూడా ఆమోదయోగ్యంగా కనిపించలేదు. అందరికీ అంచనాలకి మించి ఎక్కువ ధరకి వెచ్చించింది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రన్ మాలిక్ (రూ.4 కోట్లు) ని సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది.


26 మంది స్టార్ ఆటగాళ్లు దూరం
ఆరంభ మ్యాచ్‌లకు సుమారు 26 మంది స్టార్ క్రికెటర్లు దూరం కానున్నారు. ఆ సమయంలో వీరు తమ దేశం తరఫున ఆడేందుకు విదేశీ పర్యటనలకు వెళ్లడమే. మరికొద్దిమంది ఆటగాళ్లు ఏకంగా ఐపిఎల్ మొత్తానికి దూరం కానున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఐపిఎల్ జరిగే సమయంలోనే దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ సిరీస్ ఉన్న కారణంగా ముస్తాఫిజుర్ రెహ్మాన్, లుంగీ ఎన్గిడి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇక పేసర్ నోర్ట్‌జే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆరంభ మ్యాచ్‌లకు మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, క్వింటన్ డి-కాక్ వంటి విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. గాయపడ్డ ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్ అందుబాటులో ఉండటం కష్టమే. మార్కస్ స్టోయినిస్ మాత్రం పాకిస్తాన్‌తో సిరీస్ ముగిసిన అనంతరమే లక్నో జట్టులోకి చేరనున్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టుకు జానీ బెయిర్‌స్టో, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. రబడా మాత్రం ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుజట్టులో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉన్న కారణంగా గ్లెన్ మాక్స్‌వెల్, హాజిల్‌వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ దూరం కానున్నారు. ఆ సిరీస్ ముగిసిన అనంతరమే వారు ఐపిఎల్ ఆడేందుకు భారత్ వచ్చేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఇచ్చింది.
గుజరాత్ టైటాన్స్ జట్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, వెస్టిండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ దూరం కానున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ జట్టుకు చోటు దక్కింది. ఇక విండీస్ పేసర్ జోసెఫ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగే వెస్టిండీస్ టెస్ట్ జట్టులో ఉన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్కో జాన్‌సెన్, ఐడెన్ మార్క్‌రామ్ సేవలను కోల్పోనుంది. ఆసీస్ పేసర్ అబాట్ కూడా దూరం కానున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా బ్యాటర్ వాన్-డెర్-డస్సెన్ దూరం కానున్నాడు. ఆ సమయంలోనే బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికాల సిరీస్ జరుగుతోంది. టెస్ట్ జట్టులోనూ చోటు దక్కితే ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌జట్టుకు పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్ లేకుండానే ఆరంభ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనుంది. దీనికి పాకిస్తాన్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రధాన కారణం.

ముంబయి ఇండియన్స్‌కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరం కానున్నాడు. అయితే ముంబయి ఇండియన్స్ మాత్రం తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పూర్తిస్థాయి జట్టును కలిగి ఉంది.
చెన్నరు సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ దూరం కానున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతడు భాగమై ఉన్నాడు.
వేలంలో అపశృతి

సీజన్ 2022 కోసం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12న జరిగిన ఐపిఎల్ వేలంలో అపశృతి చోటు చేసుకుంది. వేలం నిర్వహిస్తున్న ఐసిసి ప్రతినిధి హాగ్ ఎడ్‌మీడ్స్ అకస్మాత్తుగా స్టేజ్‌మీద నుంచి కిందకు పడిపోయారు. వేలంపాట నిర్వహిస్తూనే ఎడ్‌మీడ్స్ సొమ్మసిల్లిపోయారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసం బిడ్డింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా.. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో దాదాపు రెండు గంటలసేపు వేలంపాట నిలిచిపోయింది. అనంతరం స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ వ్యాఖ్యాత, క్రికెట్ విశ్లేషకుడు చారు శర్మ నిర్వహించారు.
కఠినమైన బయోబబుల్ నిబంధనలు : బిసిసిఐ

ఐపీఎల్ సీజన్-15కోసం బిసిసిఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి నిబంధనలను ప్రతి ఒక్క ఆటగాడు తు.చ. తప్పక పాటించాల్సిందే నని స్పష్టం చేసింది. ఒకవేళ బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఆటగాడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎవరైనా ఆటగాడు బుడగ దాటితే తొలిసారికి ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్, రెండో ఉల్లంఘనకు ఓ మ్యాచ్ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్ నుంచే తప్పించేలా నిబంధనలను తయారుచేసింది. ఒక ఫ్రాంచైజీ ఆటగాడు ఇలా టోర్నీకి దూరమైతే.. ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించ బోమని పేర్కొంది. ఇక, ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరైనా ఆటగాడు/ ఫ్రాంచైజీ సభ్యుడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ.కోటి జరిమానా, రెండోసారికి ఒక పాయింట్ కోత, మూడోసారికి రెండు పాయింట్ల కోత ఉంటుందని బిసిసిఐ స్పష్టం చేసింది. బయోబబుల్ నిబంధనలు ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకే కాకుండా వారి కుటుంబాలకూ ఉంటుందని వెల్లడించింది. కుటుంబ సభ్యుల మొదటి ఉల్లంఘనకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్, రెండోసారికి బుడగ నుంచి తొలగిస్తారని వివరించింది. దీంతో పాటు కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు, రెండోసారికి రూ.75 వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి నిరాకరణ ఉంటుందని బిసిసిఐ స్పష్టం చేసింది.






- పఠాన్ మహబాషా
8919999289