Sep 29,2021 06:34

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత 1990వ దశాబ్దంలో వలె యువకులు ఎక్కువగా తీవ్రవాదం వైపు ఆకర్షితులౌతున్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పటి వలె ఇపుడు పాకిస్తాన్‌ ప్రోత్సాహం లేదు. యువత తమకు తాముగానే తీవ్రవాదం వైపు మొగ్గుతున్నారు. వారు పాకిస్తాన్‌కు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సైన్యం చేతుల్లో ప్రజలు పడుతున్న వేధింపులు యువతను తీవ్రవాదం వైపు నెడుతున్నాయి. ఉద్యోగాలు లేవు. ఉపాధికి మార్గం లేదు. యువతకు రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే తీవ్రవాదులతో చేరటం లేదా ఆత్మహత్య చేసుకోవటం.
       జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి 2021, ఆగస్టు 5వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తయింది. కాశ్మీర్‌ లోయలో తీవ్రవాదం పెరగటానికి ఆర్టికల్‌ 370 ప్రధాన కారణంగా ఉన్నదని, ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజికాభివృద్ధిని కుంటుపరుస్తున్నదని కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే జమ్మూకాశ్మీర్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం వాదించింది. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన రెండు సంవత్సరాల తర్వాత కేంద్రం చేసిన వాదనలు ఆచరణలో ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలించటం అవసరం.
      తీవ్రవాదాన్ని అంతం చేయటం, రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని సాధించటం ప్రధాన లక్ష్యాలుగా 370 ఆర్టికల్‌ను రద్దు చేసేటపుడు ప్రభుత్వం ప్రకటించింది. 2019తో పోల్చుకున్నపుడు 2020, 21లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ కాలంలో తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలలో 59 మంది మరణించారని, కాని పౌరులెవరూ మరణించలేదని పేర్కొంది. రాళ్ళు విసిరిన వారికి, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నవారికి భారతదేశ పాస్‌పోర్టులు ఇవ్వకూడదని, ప్రభుత్వ ఉద్యోగాలు చేయకుండా నిషేధించాలని జమ్మూ కాశ్మీర్‌ పాలనా యంత్రాంగం నిర్ణయించింది. కోపంతో రాళ్లు విసిరిన వారిని కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నవారితో సమంగా శిక్షించాలని నిర్ణయించటం ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తెలియజేస్తున్నది.
      తీవ్రవాద సంఘటనలు తగ్గినంత మాత్రాన రాష్ట్రంలో తీవ్రవాదాన్ని పెంపొందించే వాతావరణం తగ్గలేదు. 2021 ఆగస్టు 24వ తేదీన సమావేశమైన పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ నాయకులు రాష్ట్రంలో నెలకొన్న శ్మశాన నిశ్శబ్దాన్ని సాధారణ పరిస్థితులు నెలకొనటంగా భ్రమపడవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీయులను అవమానించటం ద్వారా తన ఘనతను చాటుకోవటానికి ప్రయత్నం చేస్తున్నదని, తాము కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని భావిస్తున్నామని, కాశ్మీర్‌ ప్రజలను అవమానించటాన్ని విరమించుకోకపోతే ప్రమాదకరమైన పర్యవసానాలు ఎదురౌతాయని వారు చెప్పారు.
      కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత 1990వ దశాబ్దంలో వలె యువకులు ఎక్కువగా తీవ్రవాదం వైపు ఆకర్షితులౌతున్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పటి వలె ఇపుడు పాకిస్తాన్‌ ప్రోత్సాహం లేదు. యువత తమకు తాముగానే తీవ్రవాదం వైపు మొగ్గుతున్నారు. వారు పాకిస్తాన్‌కు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సైన్యం చేతుల్లో ప్రజలు పడుతున్న వేధింపులు యువతను తీవ్రవాదం వైపు నెడుతున్నాయి. ఉద్యోగాలు లేవు. ఉపాధికి మార్గం లేదు. యువతకు రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే తీవ్రవాదులతో చేరటం లేదా ఆత్మహత్య చేసుకోవటం.
     యువకులు, సామాన్య ప్రజలు ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినా అధికారులు వారిపై ఐపిసి లోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. సజ్జాద్‌ రషీద్‌ సోఫి అనే యువకునిపై ఐపిసి 153 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రజలు బయటి నుండి వచ్చిన వారి కన్నా స్థానిక అధికారుల నుండి ఎక్కువ ఆశిస్తున్నారని అతడు జూన్‌ 10వ తేదీన గవర్నర్‌ సలహాదారుతో చెప్పారు. ప్రజల మధ్య శతృత్వాన్ని పెంపొందిస్తున్నాడనే ఆరోపణలతో ఆరోజే అతనిపై కేసు బనాయించారు. ఈ విధంగా వాస్తవాలను వెల్లడిస్తున్న వారిపైనా, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వారిపైనా దేశ వ్యతిరేకులని, తీవ్రవాదులని, పాక్‌ అనుకూలురని ముద్ర వేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను తరచుగా మైనారిటీ తీరని వారిపై కూడా ప్రయోగించటంతో యువకులలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. యువకులు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు లేకుండా తీవ్రవాదులకు సాయపడేవారిగా పని చేస్తున్నారు. అవసరమైనన్ని ఆయుధాలు, మందుగుండు లభ్యమైతే వారంతా తీవ్రవాదులుగా రూపుదాల్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి.
      ప్రత్యేక హోదా రద్దుతో ఒక దేశం, ఒక రాజ్యాంగం, ఒక జెండా, ఒక మార్కెట్‌ సాకారమైందని కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగంలో జమ్మూకాశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు ప్రచారం చేస్తూ కేంద్రం దేశ ప్రజలను తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేసింది. రాజ్యాంగంలోని 371 ఆర్టికల్‌ లోని వివిధ సెక్షన్‌లు ఈశాన్యరాష్ట్రాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్నాయి. వీటిని కప్పిపెట్టి, జమ్మూకాశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నట్లు, తద్వారా అక్కడ వేర్పాటువాదం పెరుగుతున్నట్లు చేసిన ప్రచారం దేశప్రజలలో జమ్మూకాశ్మీర్‌ ప్రజలపై వ్యతిరేకత పెరగటానికి దారితీసింది.
 

                                             ఆర్థికాభివృద్ధిపై తప్పుడు ప్రచారం

      జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న ఆర్థికాభివృద్ధిని గురించి కేంద్రం గొప్పగా ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవంగా జరిగిన అభివృద్ధి లేదు. 2019 ఆగస్టు 5 తర్వాత గడచిన రెండు సంవత్సరాలలో 4 నెలలు నిరసనల వలన, మరో ఏడు నెలలు కోవిడ్‌ వలన వ్యాపారాలు మూతపడినాయి. ఈ కాలంలో మొత్తం ఆర్థిక వ్యవస్థకు 70 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాశ్మీర్‌ ఎకనామిక్‌ అలయెన్స్‌ అంచనా వేసింది. చేతివృత్తులు, టూరిజం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హార్టికల్చర్‌ తదితర రంగాలలో లక్ష మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. జమ్మూకాశ్మీర్‌ లోని గ్రామీణ ప్రాంతాలు ఇంత తీవ్రమైన దుస్థితిని ఎదుర్కోవటం గత 70 సంవత్సరాలలో ఇదే తొలిసారి. 2019, ఆగస్టు 5కు ముందు ప్రభుత్వానికి అవసరమైన సరుకులన్నింటినీ జమ్మూ కాశ్మీర్‌ వర్తకుల నుండే కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత దేశం లోని మిగతా ప్రాంతాలలోని వర్తకుల నుండి కూడా కొనుగోలు చేయటంతో జమ్మూ కాశ్మీర్‌లోని వర్తకులు వారితో పోటీ పడలేక గతంలో ఉన్న మార్కెట్‌ను కూడా కోల్పోయారు.
      రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. 2019 నవంబరులో కురిసిన అకాల మంచు వారి పంటలను నాశనం చేసింది. మిగిలిన పంటను అమ్ముకోవటానికి ప్రయత్నిస్తే మిలిటెంట్ల నుండి బెదిరింపులు ఎదురయ్యాయి. ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత సాధారణ జీవితాలు గడుపుతున్న, వ్యాపారాలు సాగిస్తున్న వారిపై మిలిటెంట్లు దాడులకు పూనుకొనే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితు లలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకపోవటం రైతాంగంలో అసంతృప్తిని పెంచింది. ఆగస్టు 5 తర్వాత వివిధ కారణాలను చూపుతూ ప్రభుత్వం కొందరు వ్యాపారులను అరెస్టు చేసింది. ఈ అంశంపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాశ్మీర్‌ లోయలో మొత్తం 200 మంది తీవ్రవాదులున్నారు. అందుకు కాశ్మీరీయులందరినీ శిక్షిస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు.
 

                                               కేంద్ర విధానాలే అవినీతికి కారణం

     జమ్మూకాశ్మీర్‌లో అవినీతి పెరగటానికి, అభివృద్ధిలో రాష్ట్రం వెనుకపడటానికి ఆర్టికల్‌ 370 కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నది. అవినీతి, బంధుప్రీతి, కాశ్మీరీయులు దూరం కావటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు మినహా ఆర్టికల్‌ 370 కారణం కాదు. కేంద్రంలో వరుసగా వస్తున్న ప్రభుత్వాలు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులను సంతృప్తి పరచటానికి అనుసరిస్తున్న విధానాలు అవినీతి, బంధుప్రీతి, అసమర్ధ పరిపాలనకు కారణమౌతున్నాయి.
 

                                        అంతర్జాతీయ సమస్యగా మార్చిన బిజెపి ప్రభుత్వం

    ఆర్టికల్‌ 370 రద్దుతో మన అంతర్గత సమస్యగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌ అంతర్జాతీయ సమస్యగా మారింది. జమ్మూకాశ్మీర్‌ సమస్యను భారత్‌, పాకిస్తాన్‌లు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న విధానానికి గత 50 సంవత్సరాల నుండి మన దేశం కట్టుబడి ఉంది. సమస్య పరిష్కారానికి మూడవ పార్టీ మధ్య వర్తిత్వాన్ని భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత అమెరికా హౌస్‌ రిజల్యూషన్స్‌ పాస్‌ చేసి, భారత ప్రభుత్వ చర్యను ఖండించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశాలలో భారతదేశ చర్యపై చర్చించారు. కాశ్మీర్‌ సమస్యపై అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని బ్రిటన్‌ లోని లేబర్‌ పార్టి డిమాండ్‌ చేసింది. సమస్య పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో చర్చించాలని యూరోపియన్‌ యూనియన్‌ ప్రభుత్వాన్ని కోరింది. దీని నుండి పక్కదారి పట్టించటం కోసం ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల పేరుతో 2019 అక్టోబరులో ఇ.యు లోని అతి మితవాద పార్టీల ప్రతినిధులను కాశ్మీర్‌కు పిలిపించటం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్యపై అంతర్జాతీయ చర్చను తీవ్రం చేసింది. రెండో విడత 15 దేశాల రాయబారులను పిలిచారు. భారత, పాకిస్తాన్‌లు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి తమ దేశం మధ్యవర్తిత్వం వహిస్తుందని చివరికి అమెరికాలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి కూడా చెప్పాడు.
 

                                       నియోజక వర్గాల పునర్విభజనపై ఆందోళన

     నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కాశ్మీరీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 సెన్సస్‌ ప్రకారం కాశ్మీర్‌ లోయలో 69 లక్షల మంది ఉండగా, జమ్మూలో 54 లక్షల మంది ఉన్నారు. కాశ్మీర్‌ భూభాగం 15 వేల చదరపు కిలోమీటర్లు కాగా, జమ్మూ భూభాగం 26 వేల చదరపు కిలోమీటర్లు ఉన్నది. నియోజకవర్గాలను పునర్విభన చేసేటపుడు ప్రజలతో నిమిత్తం లేకుండా భూభాగం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని, కాశ్మీర్‌ లోయకు ప్రతికూలంగా చేస్తారేమోననే ఆందోళన కూడా ప్రజలలో ఉన్నది. ఉమ్మడి జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీలో కాశ్మీర్‌ లోయలో 46, జమ్మూలో 37, లడక్‌లో 4, మొత్తం 87 స్థానాలు ఉన్నాయి. విభజన అనంతరం 4 స్థానాలు లడక్‌ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంటాయి కాబట్టి జమ్మూకాశ్మీర్‌కు 83 స్థానాలు ఉంటాయి.
    శీతాకాలంలో రాజధానిని శ్రీనగర్‌ నుండి జమ్మూకు మార్చే సాంప్రదాయం 149 సంవత్సరాల నుండి కొనసాగుతున్నది. ఉన్నతాధికారులతో పాటు సాధారణ అధికారులు, సిబ్బంది కూడా జమ్మూ ప్రాంతానికి వచ్చి ఉండేవారు. కాని ఈ సంవత్సరం అందుకు భిన్నంగా కాశ్మీర్‌ నుండి రావలసిన అధికారులకు ప్రభుత్వం అధికారిక నివాసాలను కేటాయించలేదు. ఇ-గవర్నెన్స్‌ను ఉపయోగించు కొని సిబ్బందిని కదిలించకుండానే ఫైళ్ళను పరిష్కరించుకోవచ్చునని, తద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చునని ప్రభుత్వం చెబుతున్న సాకులు ప్రజలను సంతృప్తి పర్చలేదు. సిబ్బందిని కూడా తరలించి ఉంటే జమ్మూకు రాజధాని వాతావరణం ఏర్పడేది. వృత్తులు, వ్యాపారాలు పుంజుకునేవి. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ చర్య ప్రజలలో అసంతృప్తిని పెంచింది.
 

                                           జమ్మూ లోనూ పెరుగుతున్న అసంతృప్తి

    కాలం గడిచేకొద్ది ప్రభుత్వ విధానాలపై జమ్మూలో కూడా అసంతృప్తి పెరుగుతున్నది. గతంలో ఆర్టికల్‌ 370, 35ఎ ని రద్దు చేయాలని డిమాండ్‌ చేయటంలో ముందున్న బిజెపి స్థానిక శాఖలోని ఎక్కువ మంది కూడా రాష్ట్ర హోదాను పునరుద్ధరించమని ఇపుడు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరిస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేశారని, కాని రాష్ట్రాన్ని విభజించిన తర్వాత జరిగిన అభివృద్ధి నామమాత్రమే నని వారు పేర్కొంటున్నారు. కాశ్మీర్‌ లోయలో కన్నా జమ్మూలో రక్షణ పరిస్థితులు మెరుగుగా ఉండటంతో, ఆర్టికల్‌ 35ఎ రద్దు వలన చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని బయటి వారు ఈ ప్రాంతంలోని భూములను కాజేస్తారనే ఆందోళన స్థానికులలో తీవ్రంగా ఉన్నది. ప్రధాని వాగ్దానం చేసిన విధంగా జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలలో డిమాండ్‌ పెరుగుతున్నది.
 

ఎ. కోటిరెడ్డి

ఎ. కోటిరెడ్డి